టీఎస్‌పీఏ అభివృద్ధిలో మరో ముందడుగు
డైరెక్టర్ అభిలాష బిస్ట్
రాజేంద్రనగర్, ఆగస్టు 27 (విజయక్రాంతి): ఆర్బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ అభివృద్ధిలో భాగంగా డైరెక్టర్ అభిలాష బిస్త్, ఐపీఎస్ మూడు నూతన సదుపాయాలను ప్రారంభించారు. 14 సీట్ల ఎలక్ట్రిక్ గోల్ఫ్ కార్ట్, ఆధునీకరించిన ఫోటోగ్రఫీ స్టూడియో, కాపీప్రింట్ లాంజ్ను ప్రారంభించారు.
వీఐపీలు, వీవీఐపీల అకాడమీ సందర్శనకు అనుకూలంగా పర్యావరణహిత గోల్ఫ్ కార్ట్ను అందుబాటులోకి తెచ్చారు. ఫోటోగ్రఫీ స్టూడియోలో నూతన కెమెరాలు, డ్రోన్ తదితర ఆధునిక పరికరాలను సమకూర్చారు. అలాగే హైస్పీడ్ ప్రింటింగ్, జిరాక్స్ యంత్రాలతో కాపీప్రింట్ లాంజ్ను ఆధునీకరించారు. కేవలం రెండు వారాల్లోనే మూడు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడం విశేషమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, డీఎస్పీలు, ఫ్యాకల్టీ, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






