బెట్టింగ్ ముఠా అరెస్ట్
కేపీహెచ్‌బీ ఇండిస్ వన్ సిటీలో పోలీసుల తనిఖీలు
కూకట్‌పల్లి, ఆగస్టు 23 (విజయక్రాంతి): కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలోని ఇండిస్ వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని, రూ. 30 లక్షలు స్వాధీనం చేసుకున్న సంఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని చంద్రగిరి పరిసర గ్రామాలకు చెందిన దేశినేని సుమంత్, మాకాటి మనోజ్, కనుమూరి గౌతమ్ చౌదరి ఇండిస్ వన్ సిటీ అపార్ట్‌మెంట్‌లోని ఓ ప్లాట్‌ను అద్దెకు తీసుకొని ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి విందు చేసుకుంటూ ముగ్గురిలో ఒకరు మద్యం మత్తులో తన స్నేహితురాలికి ఫోన్ చేసి తనని ఎవరో కిడ్నాప్ చేశారని ఫ్రాంక్ సందేశం పంపాడు. స్పందించిన ఆమె వెంటనే 112కు డయల్ చేసింది. కేపీహెచ్‌బీ పెట్రోలింగ్ పోలీసులు ఇండిస్ వన్ సిటీలోని ఆ ప్లాట్‌కు చేరుకున్నారు.
తనిఖీ చేపట్టగా సూట్ కేసులో రూ. 30 లక్షలను గుర్తించారు. ఇంత డబ్బు ఎక్కడిది? అని ఆ యువకులను ప్రశ్నించగా వారి నుంచి స్పష్టమైన సమాచారం రాలేదన్నారు. డబ్బును స్వాధీనం చేసుకొని, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సుమంత్, మనోజ్, గౌతంలు క్రికెట్ ఆటకు అంచనాలకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్‌ను నడపడంతోపాటు క మీషన్ కోసం ఆన్‌లైన్ బెట్టింగ్ అప్లికేషన్లను ప్రచారం చేస్తున్నట్టుగా తెలిసిందన్నారు. నిందితుల వద్ద నుంచి నగదుతోపాటు ఒక సాంసంగ్ టాబ్లెట్, మూడు మొబైల్‌లను స్వాధీనం చేసుకున్నారు.






