హైవేపై బెల్ట్ షాపులు నిషేధించాలి
* హైవేపై ట్రాఫిక్ నిలిపితే కఠిన చర్యలు
* ప్రతి దుకాణంలో సీసీ కెమెరాలు తప్పనిసరి
* ఎస్ఐ బి. శ్రీకాంత్ గౌడ్
గరిడేపల్లి,(విజయ క్రాంతి): నేషనల్ హైవేపై ఉన్న బెల్ట్ షాపులపై ప్రత్యేక దృష్టి సారించాలని, అక్రమంగా మద్యం విక్రయించే దుకాణాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటా అన్ని ఎస్సై శ్రీకాంత్ గౌడ్ అన్నారు. గరిడేపల్లి మండల కేంద్రంలోని నేషనల్ హైవే వెంట ఉన్న బెల్ట్ షాపులు, హోటళ్లు, కిరాణా దుకాణాల యజమానులను గరిడేపల్లి ఎస్సై బి. శ్రీకాంత్ గౌడ్ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ నేషనల్ హైవే వెంట ఉన్న ప్రతి దుకాణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దుకాణాల వద్ద జరిగే ప్రతి కార్యకలాపం నిఘాలో ఉండేలా కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా భద్రతను మరింత పెంచవచ్చని తెలిపారు. దుకాణ యజమానులు పోలీసులకు సహకరించి, ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలకు అవకాశం ఇవ్వకూడదని సూచించారు. అదేవిధంగా నేషనల్ హైవేపై వాహనాలను ఇష్టారాజ్యంగా నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని ఎస్సై హెచ్చరించారు.
ముఖ్యంగా హోటళ్లు, కిరాణా దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల ముందు వాహనాలను రోడ్డుపై నిలిపివేయడం వల్ల ప్రమాదాలకు అవకాశం ఉంటుందని తెలిపారు. హైవేపై ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని కోరారు. నేషనల్ హైవేపై ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. హైవేపై వాహనాలను నిలిపి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవు” అని ఎస్సై బి. శ్రీకాంత్ గౌడ్ స్పష్టం చేశారు.
బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలినేషనల్ హైవే పరిధిలో అనుమతులు లేకుండా మద్యం విక్రయించే బెల్ట్ షాపులను నియంత్రించేందుకు సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. హైవే వెంట బెల్ట్ షాపుల నిర్వహణతో పాటు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల ముప్పు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.నేషనల్ హైవే భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులతో పాటు వ్యాపారులు, వాహనదారులు, ప్రజలు సహకరించాలని ఎస్సై సూచించారు.






