4 August, 2026 | 2:33 AM

బొక్కల వాగు చెక్ డ్యామ్' సుందరీకరణ కార్యక్రమం ప్రారంభం

03-08-2026 09:33 PM

మంథని, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ, 3 ఆగస్టు 2026: 

పెద్దపల్లి జిల్లా మంథనిలోని బొక్కల వాగు చెక్ డ్యామ్‌ను సుందరీకరించే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, పరిశ్రమలు & వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు అధికారికంగా ప్రారంభించారు.

ఈ ప్రాజెక్టును తమ ప్రధాన సామాజిక భాగస్వామ్య కార్యక్రమమైన 'ప్రాజెక్ట్ షైన్'లో భాగంగా హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ (హెచ్‌సీసీబీ) చేపడుతోంది. ఈ  సుందరీకరణ కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ కోయ శ్రీ హర్ష ,ఐఏఎస్, హెచ్‌సీసీబీ ఇంటిగ్రేటెడ్ సప్లై చైన్ హెడ్ అవినాష్ కాంత్ కుమార్, హెచ్‌సీసీబీ చీఫ్ పబ్లిక్ అఫైర్స్, కమ్యూనికేషన్స్ , సస్టైనబిలిటీ ఆఫీసర్ హిమాన్షు ప్రియదర్శిలతో పాటు స్థానిక అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. గోదావరి నదీ తీరంలో ఉన్న మంథని ప్రాంతానికి దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం నుంచి నీటి నిర్వహణ చరిత్ర ఉంది; ఇక్కడి చెరువుల ఆధారిత సాగునీటి వ్యవస్థలు శాతవాహన, కాకతీయ కాలం నాటివి. మంథని ప్రాంతంలోని స్థానిక ప్రజలకు అత్యంత కీలకమైన సామాజిక నీటి వనరును మెరుగుపరచడం ద్వారా ఈ వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడమే 'బొక్కల వాగు చెక్ డ్యామ్' కార్యక్రమం యొక్క లక్ష్యం.

ఈ కార్యక్రమంలో భాగంగా, స్థానిక మౌలిక సదుపాయాలు , సౌకర్యాలను మెరుగుపరిచేందుకు బొక్కల వాగు చెక్ డ్యామ్ పరిసరాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ ప్రయత్నాలు స్థానిక ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేలా ప్రజా వినియోగ ప్రదేశాన్ని తీర్చిదిద్దడంతో పాటు, చుట్టుపక్కల పర్యావరణాన్ని కూడా మెరుగుపరుస్తాయి.  "మంథని ప్రజల కోసం ఎంతో విలువైన సామాజిక ఆస్తిని మెరుగుపరచడంలో బొక్కల వాగు చెక్ డ్యామ్ సుందరీకరణ కార్యక్రమం ఒక ముఖ్యమైన ముందడుగు. నీటి సంరక్షణ మరియు సామాజిక నీటి వనరులతో ఈ ప్రాంతానికి శతాబ్దాల అనుబంధం ఉంది. స్థానిక నివాసితుల కోసం మెరుగైన ప్రజా ప్రదేశాలను సృష్టిస్తూనే, ఆ వారసత్వాన్ని పరిరక్షించాలనే మా నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందనీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రాజెక్ట్ షైన్ కింద హిందుస్థాన్ కోకా-కోలా బేవరేజెస్ (హెచ్‌సీసీబీ)తో ఇటువంటి భాగస్వామ్యాలు సమాజానికి మేలు చేస్తాయని ప్రశంసించారు.

కాగా తాము సేవలు అందించే సమాజాల పురోగతితోనే తమ అభివృద్ధికి లోతైన సంబంధం ఉందని హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ (హెచ్‌సీసీబీ) ఇంటిగ్రేటెడ్ సప్లై చైన్ హెడ్ అవినాష్ కాంత్ కుమార్ చెప్పారు. తెలంగాణలో విస్తృత స్థాయిలో కార్యకలాపాలను నిర్వహిస్తోన్న ఒక ప్రముఖ బేవరేజ్ తయారీ సంస్థగా, సమాజ శ్రేయస్సును పెంపొందించే,  సుస్థిర అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం ద్వారా తాము మా వ్యాపార కార్యకలాపాలకు అతీతంగా దీర్ఘకాలిక విలువను సృష్టించడానికి కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణలో హెచ్‌సీసీబీ విస్తృత స్థాయిలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇది సిద్దిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్ మరియు సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లో రెండు అత్యాధునిక తయారీ ప్లాంట్లను నిర్వహిస్తోంది. తమ ప్రధాన సామాజిక భాగస్వామ్య కార్యక్రమమైన ప్రాజెక్ట్ షైన్ ద్వారా నీటి లభ్యత, సంరక్షణ, ఆరోగ్య సంరక్షణ, విద్య,  జీవనోపాధి పెంపుదల వంటి కార్యక్రమాల కోసం పెద్దపల్లితో సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా యంత్రాంగాలతో హెచ్‌సీసీబీ కలిసి పనిచేస్తుంది.