పంతాల యుద్ధం!
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సహా కీలక వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ చర్యలతో ఇరాన్ రగిలిపోతున్నది. నాయకత్వ మార్పు సహా శాంతి నెలకొనేవరకు తమ దాడులు ఆపబోమని అమెరికా, ఇజ్రాయెల్‌లు ప్రకటించాయి. ఇరాన్ మాత్రం ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకునే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేసింది.
గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ దాడులకు తెగబడుతుంది. దీంతో పశ్చిమాసియా డోలాయమాన స్థితిలో నిలిచింది. తాజాగా అమెరికాకు నాటో కూటమి మద్దతు పలకడం, ఇంకోవైపు ఇరాన్‌కు చైనా మద్దతివ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. ఇరాన్‌పై అమెరి కా దాడులు వెనుక కారణాలు అనేకం. ఇటీవలే తమతో అణు ఒప్పందా నికి రావాలంటూ ఇరాన్‌కు అమెరికా ప్రతిపాదనలు చేసింది.
చర్చలు జరుగుతున్నప్పటికీ ఇరాన్‌పై దాడులు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. నిజానికి 2015లోనే ఇరాన్ తొలిసారి అమెరికాతో అణు ఒప్పందానికి అంగీకరించింది. కానీ 2018లో అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పరిస్థితి మొదటికి వచ్చింది.
గతేడాది జూన్‌లో ఇరాన్‌తో యుద్ధంలో ఇజ్రాయెల్ వైపు నిలిచిన అమెరికా బీ2బీ బాంబర్లతో ఇరాన్‌లోని అణు కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. అయితే ఇరాన్ తమ మాటలను బేఖాతరు చేస్తూ అణు కేంద్రాలను పునర్నిర్మిస్తున్నట్లు సమాచారం అందడంతో అమెరికా కన్నెర్ర చేసింది. పైగా 1989లో ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖమేనీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్‌జీసీ) అండ తో లెబనాన్‌లో హెజ్బొల్లా, గాజాలో హమాస్, యెమెన్‌లో హౌతీలు పురు డు పోసుకోవడానికి కారణమనే భావన అమెరికా, ఇజ్రాయెల్‌లో పెరిగిపోయింది.
మరోవైపు 36 ఏళ్లుగా నియంతలా ఇరాన్‌ను శాసిస్తున్న సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీపై దేశ ప్రజల్లో వ్యతిరేకత రావడమనేది సహజం. ఖమేనీ మత ఛాందస వైఖరి వల్ల ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించడం ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. కొంత అవినీతి పెరిగిపోవడం, నిత్యావస రాల ధరలు ఆకాశాన్ని అంటడం ప్రజల ఆందోళనకు కారణమయ్యింది. అయితే ఖమేనీ ప్రజల నిరసనలు అణగదొక్కే ప్రయత్నం చేయడం ఆయనపై వ్యతిరేకతను బాగా పెంచింది.
ఖమేనీ బతికున్నంత కాలం ముప్పు తప్పదని గ్రహించిన అమెరికా, ఇజ్రాయెల్‌లు పాలన మార్పు పేరుతో దేశ అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిని చంపడం సరైన చర్య కాదు. ఖమేనీ మృతిని వ్యతిరేకిస్తూ ఇరాన్‌లోని పవిత్ర నగరం కోమ్లోలోని జమ్కరన్ మసీదుపై ప్రభుత్వం, సైన్యం ఎర్ర జెండా ఎగురవేయడం ప్రతీకారం తీర్చుకునే వరకు యుద్ధం ఆపేది లేదని తేల్చి చెప్పింది. ఇక ఖమేనీ మృతి తర్వాత దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు ఇదే మంచి తరుణమని ఇరాన్ ప్రజలకు అమెరికా పిలుపునివ్వడం కూడా విడ్డూరమైన చర్యే.
ఏ దేశానికైనా రాజ్యాంగ మనేది ఒకటి ఉంటుంది. రాజ్యాంగంలోని చట్టం ప్రకారం ప్రభుత్వాలు ఏర్పాడుతాయన్న విషయం అమెరికాకు తెలియదా అన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. చివరగా ప్రపంచదేశాల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని యుద్ధానికి స్వస్తి పలికి శాంతిస్థాపన దిశగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌లు అడుగులేయాల్సిన అవసరముంది.




