8 March, 2026 | 11:13 AM

ఆనందాల రంగుల కేళి!

03-03-2026 12:00 AM

వసంత ఋతువు ఆగమనాన్ని పురస్కరించుకొని ఆనందోత్సాహలతో ఆహ్లాదంగా జరుపుకునే ఆత్మీయనురాగాల రంగుల కేళి హోలీ. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఆనందోత్సాహాల మధ్య ఆనందంగా జరుపుకునే పండుగ ఇది. వసంత ఋతువు మనసుకి నవ చైతన్యాన్నిస్తుంది. దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకునే పండుగల్లో హోలీ పండుగ కూడా ఒకటి. ప్రతియేటా ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్షం పౌర్ణమి తిథి రోజు ఈ హోలీ పండుగను జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ వేడుకలను నిర్వహిస్తారు. హోలీ పండుగ కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు..

అనేక పురాణ గాథలతో ముడిపడి ఉంటుంది.  రాక్షస రాజు అయిన హిరణ్యకశపుడి కొడుకు ప్రహ్లాదుడు నిత్యం మహావిష్ణువును స్మరిస్తుంటాడు. కుమారుడు అలా చేయడం హిరణ్యకశపుడికి నచ్చదు. ఈ కారణంగా ప్రహ్లాదుడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు. వెంటనే అతని రాక్షస సోదరి హోళికను పిలుస్తాడు. ఆమెకున్న శక్తియుక్తులతో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని కోరతాడు.

దీంతో హోళిక ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని దట్టమైన మంటల్లోకి దూకుతుంది. అయితే మహావిష్ణువు మాయ కారణంగా ప్రహ్లాదుడు ప్రాణాలతో బయపడతాడు. కానీ హోళిక మాత్రం ఆ మంటల్లో చిక్కుకుని చనిపోతుంది. హోలిక దహనమైన ఈ రోజును హోలీ అని పిలుస్తారనే ప్రచారం కూడా ఉంది. అందుకే ఉత్తర భారతదేశంలో అనేక ప్రాంతాల్లో రాత్రి వేళ హోలిక దహనం కూడా నిర్వహిస్తారు. అయితే ఒకప్పుడు సంప్రదాయ బద్దమైన హోలీ పండగను ప్రేమానురాగాలకు తార్కాణంగా జరుపుకునే వారు.

ప్రకృతిలో దొరికే రకరకాల పూలతో, వేపాకులు, పసుపు, కుంకుమ కలిపిన నీటితో వసంతోత్సవ వేడకను జరుపుకునేవారు. ఇలా చేయడం వల్ల చర్మవ్యాధులు ప్రబలకుండా ఉండేవి. కానీ నేడు మాత్రం వాటి స్థానంలో కృత్రిమ రసాయనిక రంగులు మార్కెట్లోకి రావడంతో ప్రజలు వాటి పైన మోజు పెంచుకుని అనర్థాలను కొని తెచ్చుకుంటున్నారు. ప్రకృతిలో అందాన్ని, ఆహ్లాదాన్ని పంచేవి పూలు. వీటికున్న అద్భుతమైన శక్తి అలాంటిది. మరుగొల్పే చల్లని మల్లెలు, కాంతులీనే కనకాంబరాలు, సన్నజాజుల సోయగాలు, పరిమళాలు వెదజల్లే లిల్లీలు కనువిందు చేస్తాయి.

గులాబీలు గుబాళింపజేస్తాయి. మోడుబోయిన మోదుగ చెట్ల నిండా ఎర్రని పూలు ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కృత్రిమ రంగులతో హోలీ ఆడడం వల్ల వాటిలోని రసాయానాలు.. నేత్ర, చర్మ, జీర్ణకోశ సంబంధిత అవయాలపైన తీవ్ర ప్రభావం చూపుతాయి. కాబట్టి, సహజసిద్ధమైన రంగులతో హోలీ జరుపుకోవడం సరైన మార్గం. హోలీ నాడు కృత్రిమ రంగులకు దూరంగా ఉంటూ, ప్రకృతిలో లభించే సహజ రంగులను వినియోగిస్తే, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునేవాళ్లమవుతాం. సంప్రదాయ బద్దమైన రంగుల పండుగ కాబట్టి, రంగు వచ్చే రకరకాల పూలతో, ముఖ్యంగా మోదుగ పూలతో తయారు చేసుకున్న రంగులతోనే హోలి జరుపుకోవడం ఉత్తమం. 

కృత్రిమ రసాయనిక రంగులు వాడి చర్మ వ్యాధులు తెచ్చుకోవడం అవివేకం. రంగులు చల్లుకోవడంలో జాగ్రత్తలు తీసుకుంటూ, సున్నితమైన రంగులతో సరదాగా కాసేపు ఆడుకుని, ఆ వెంటనే మన శరీరానికి అంటిన రంగుల్ని తొలగించుకుంటే చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి.  హిందూ సంప్రదాయంలో ప్రతి పండుగ వెనుక ఒక విశిష్టత దాగి ఉంటుంది.  

 కాయల నాగేంద్ర, హైదరాబాద్