కీసరలో ఎన్‌సీసీ కేడెట్లకు పొక్సో చట్టంపై అవగాహన
మేడ్చల్, మే 6 (విజయ క్రాంతి): కీసరలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ నివాస విద్యా సంస్థల సొసైటీ లో 600 మందికి పైగా ఎన్సిసి కేడెట్ల కోసం పోక్సో (POCSO) చట్టం - లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాలల భద్రత, సాధికారత పట్ల ఉన్న నిబద్ధతను చాటుతూ, పోలీస్ కమిషనర్ సుమతి నాయకత్వంలో మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ సహకారంతో మల్కాజ్గిరి సెక్యూరిటీ కౌన్సిల్ ఈ సదస్సును ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమానికి సావిత్రి అధ్యక్షత వహించారు. వక్తలందరూ పోక్సో చట్టంలోని కీలక అంశాలను వివరిస్తూ, ముఖ్యంగా మంచి స్పర్శ, చెడు స్పర్శ గురించి కేడెట్లకు అవగాహన కల్పించారు. ఇంటరాక్టివ్ చర్చలు వాస్తవ ఉదాహరణల ద్వారా అసురక్షిత పరిస్థితులను ఎలా గుర్తించాలి వాటిపై ఎలా స్పందించాలి అనే విషయాలను విద్యార్థులకు వివరించారు. అసోసియేట్ డైరెక్టర్ సావిత్రి మాట్లాడుతూ దుర్వినియోగానికి వ్యతిరేకంగా గళం విప్పడం చాలా ముఖ్యం. ఎవరూ నిశ్శబ్దంగా బాధపడకూడదు.
బాధితులకు అండగా ఉండటానికి చట్టపరమైన రక్షణ సహాయక వ్యవస్థలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి.‘అన్నారు. పాఠశాలలు, కళాశాలలు మరియు ఇతర సంస్థలు తమ ప్రాంగణాల్లో ఇటువంటి అవగాహన సదస్సులను నిర్వహించడానికి ముందుకు రావాలని మల్కాజ్గిరి సెక్యూరిటీ కౌన్సిల్ అధికారులు పిలుపునిచ్చారు. ఆసక్తి గల సంస్థలు అసోసియేట్ డైరెక్టర్ సావిత్రి వాట్సాప్ నంబర్ *7075711105* ద్వారా సంప్రదించాలని తెలిపారు.






