8 May, 2026 | 2:24 AM

తలసేమియాపై పోరులో అవగాహనే ఆయుధం

08-05-2026 12:00 AM

ఏటా మే 8న జరుపుకొనే ప్రపంచ తలసేమియా దినోత్సవం మన సమాజంలో ఇంకా అర్థం కాని ఒక వారసత్వ రక్త వ్యాధి తలసేమియా  గురించి అవగాహన పెంపొందించడానికి ఎంతో ముఖ్యమైన సందర్భం. ఈ దినోత్సవం ఒక ఆచారం కాదు, ఇది లక్షలాది కుటుంబాల బాధను గుర్తుచేసే ఒక సామాజిక బాధ్యత. తలసేమియా అనేది ఒక జన్యు సంబంధిత రక్త వ్యాధి. ఈ వ్యాధిగ్రస్తుల్లో శరీరం సరైన రీతిలో హీమోగ్లోబిన్ ఉత్పత్తి చేయదు. హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటం వల్ల రక్తహీనత, అలసట, ఎదుగుదలలో ఆలస్యం వంటి సమస్యలు కనిపిస్తాయి.

2021 అంచనాల ప్రకారం, ప్రపంచంలో సుమారు 13 లక్షల మంది తలసేమియా రోగులు ఉన్నారు. ప్రపంచ జనాభాలో సుమారు 5 శాతం మంది హీమోగ్లోబిన్ లోపాలకు క్యారియర్లుగా ఉంటారు. మొత్తం మీద 8 కోట్ల నుంచి 35 కోట్ల వరకు ప్రజలు క్యారియర్లుగా ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వేలాది కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మెడిటరేనియన్, ఆసియా, ఆఫ్రికా ప్రాంతా ల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. భారత్ వంటి దేశాల్లో తలసేమియా ఒక ప్రధాన అనారోగ్య సమస్యగా మారుతోంది.

ప్రతి సంవత్సరం వేలాది పిల్లలు ఈ వ్యాధితో జన్మిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లోపం, ముందస్తు పరీక్షలు లేకపోవడం వల్ల పరిస్థితి మరింత విషమిస్తోంది. తలసేమియాను పూర్తిగా నయం చేయడం కష్టమైనా, నివారణ మాత్రం సాధ్యమే. పెళ్లికి ముందు రక్త పరీక్షలు చేయించుకోవడం ద్వారా తలసేమియా క్యారియర్లను గుర్తించవచ్చు. ఇద్దరూ క్యారియర్లు అయితే పిల్లలకు వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే యువత ముం దుగానే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం అత్యంత అవసరం. తలసేమి యా మేజర్ ఉన్న పిల్లలకు తరచూ రక్త మార్పిడి అవసరం. అయితే దీనివల్ల ఐరన్ అధికంగా పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది.

కాబట్టి, ఐరన్ చెలేషన్ థెరపి అవసరం. దీర్ఘకాలిక చికిత్స ఖర్చుతో కూడుకున్నది కావడం వల్ల పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయి. తలసేమియా బాధితులకు సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. రక్తదానం చేయడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ప్రభుత్వ సహాయాన్ని పెంచడం వంటి చర్యలు అవసరం. పాఠశాలలు, కళాశాలలు, స్వచ్ఛంద సంస్థలు ఈ దిశగా ముందుకురావాలి. ప్రభుత్వం ఉచిత రక్తపరీక్షలు, చికిత్సా కేంద్రాలు, ఔషధాల సరఫరా వంటి అంశాల్లో మరింత చురుకైన పాత్ర పోషించాలి. ఈ వ్యాధిని అవగాహనతోనే నియంత్రించవచ్చు. నివారణే ఉత్తమ వైద్యం అనే నానుడి ఈ సందర్భంలో మరింత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. తలసేమియాను ఓడించాలంటే, అవగాహనను ఆయుధంగా మార్చుకోవాలి.

 ఆళవందార్ వేణుమాధవ్, 8686051752

(నేడు ప్రపంచ తలసేమియా దినోత్సవం)