18 August, 2026 | 3:03 AM

23 అర్ధరాత్రి నుంచి ఆటోలు బంద్

18-08-2026 01:02 AM
  1. స్కూల్ వ్యాన్, క్యాబ్‌లూ రోడ్డెక్కవు
  2. తెలంగాణ స్టేట్ ఆటో అండ్ టాక్సీ డ్రైవర్స్ యూనియన్

ముషీరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): ఆటో, స్కూల్ వ్యాన్, క్యాబ్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా నిరవధిక బంద్ నిర్వహించనున్నట్లు బీఎంఎస్ అను బంధ తెలంగాణ స్టేట్ ఆటో అండ్ ట్యాక్సీ డ్రైవ ర్స్ యూనియన్ ప్రకటించింది. ఇందిరా పార్క్ ధర్నాచౌక్‌లో సోమవారం నిర్వహించిన మహాధర్నాలో బీఎంఎస్ అఖిల భారత అధ్యక్షుడు సుంకరి మల్లేశం, భారతీయ ప్రైవేట్ ట్రాన్సుపోర్టు మజ్దూర్ మహాసంఘ్ అఖిల భారత ప్రధా న కార్యదర్శి రవిశంకర్ అల్లూరి, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చింతల నందకిశోర్, ప్రధాన కార్యదర్శి బి. పెంటయ్య గౌడ్, కె. శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయ కులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. ఆర్టీసీలో ఈవీ ఆటోల ప్రతిపాదనను విరమించుకోవాలని, ఆటోప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆటో డ్రైవర్లకు ఏటా ఇచ్చే రూ.12 వేల ఆర్థిక సహాయాన్ని బకాయిలతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త పర్మిట్లు మంజూరు చేయాలని, ఆటో త్రీ వీలర్ లైసెన్సు లు పునరుద్ధరించాలని, ఓలా, ఉబర్, ర్యాపిడో అక్రమ బైక్ సేవలను అరికట్టాలని,

ఆటో, క్యాబ్ మీటర్ ఛార్జీలు పెంచాలని, స్కూల్ వ్యాన్లకు పాఠశాలల వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. మహాధర్నా అనంతరం ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కమిషనర్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. నిరవధిక బంద్‌లో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నందకిశోర్, బి. పెంటయ్య గౌడ్ పిలుపునిచ్చారు.