5 March, 2026 | 7:42 PM

నేనే నిజమైన వారసున్ని అని ఫేక్ భూ పట్టా... కబ్జాకు యత్నం

05-03-2026 05:45 PM
  1. ఫేకు ఆధారాలతో ఉదంతం 
  2. నిజమైన వారసులకు అన్యాయం
  3.  అధికారులు సైతం... ఫేక్  వ్యక్తులకు వత్తాసు 
  4. లబోదిబోమంటున్న నిజమైన వారసులు 
  5. నిజా నిజాలు తెలుసుకొని న్యాయం జరిపించాలని వేడుకోలు

మిర్యాలగూడ, విజయక్రాంతి: సంతానం లేని వ్యక్తికి తానే వారసుడిని అని తప్పుడు పత్రాలు సృష్టించి రెవెన్యూ అధికారుల అండతో భూమిని పౌతి ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంఘటన మిర్యాలగూడ పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  బాధిత కుటుంబ సభ్యులు పేరుమాళ్ళ సుశీల , తన కుమారులు  ప్రణయ్ , జాన్సన్ రంజిత్ కుమార్ లు గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.... మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామానికి చెందిన పేరమాళ్ళ కృష్ణ ,పేరుమాళ్ళ యాదగిరి ఇద్దరు అన్నదమ్ములు.  వీరికి సర్వేనెంబర్ 607/3,608/5 లో చెరి 1 ఎకరం 5 గుంటల భూమి వారసత్వంగా వచ్చింది. పేరుమాళ్ళ కృష్ణకు వివాహం కాకపోవడంతో చివరి వరకు తన తమ్ముడైన పేరుమాళ్ళ యాదగిరి వద్ద ఉన్నాడు.

వృద్ధాప్యంలో ఉన్న కృష్ణ తనకు వారసత్వంగా వచ్చిన భూమిని తన తమ్ముడు యాదగిరికి నాలుగు లక్షల రూపాయలకు విక్రయించగా పెద్ద మనుషుల సమక్షంలో బాండ్లు రాసుకున్నారు. 2018  సంవత్సరంలో కృష్ణ అనారోగ్యంతో మరణించారని తెలియజేశారు. ఈ పొలం విషయంలో గత కొద్దిరోజులుగా చిలుకూరి అభినవ్, చెరుకుపల్లి విష్ణు అనే యువకులు చేసుకొని తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. వీరు వేధింపులు తట్టుకోలేక  పెద్దమనుషులను ఆశ్రయించామని , దీంతో వారి సమక్షంలో రూ.2.50 లక్షలు ఇస్తే మీ భూమి లోనికి రామని చెప్పి డబ్బులు తీసుకుని 2019 లో బాండు కూడా రాసిచ్చారని తెలిపారు.

ఈ క్రమంలో మిర్యాలగూడ పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఒగ్గు వినోద్ కుమార్ అనే వ్యక్తి 2025లో తాను పేరు మాల కృష్ణకు వారసుడను అని పేరుమాల్ల జీవన్ పేరుతో తప్పుడు ఆధార్ కార్డు సృష్టించి రెవెన్యూ అధికారుల అండతో భూభారతిలో వారసత్వ  పౌతి ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా అతడి అసలు పేరు ఒగ్గు వినోద్ కుమార్ తండ్రి శాంసన్ అని అతనికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు. పేరుమాల్ల కృష్ణ కులం ఎస్సీ మాల కాగా, ఒగ్గు వినోద్ కుమార్ ది ఎస్సీ మాదిగ అని తెలిపారు.

తప్పుడు పత్రాలతో  పౌతి ద్వారా జిల్లా కలెక్టర్ కు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. స్థానిక పోలీసులు భూమి కాజేసేందుకు ప్రయత్నిస్తున్న ఒగ్గు వినోద్ కుమార్ కు వత్తాసు పలుకుతూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని  కన్నీరు పెట్టుకున్నారు. మా భూమిని అక్రమంగా  పౌతి ద్వారా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఒగ్గు వినోద్ కుమార్ అతనికి సహకరిస్తున్న చిలుకూరి అభినవ్, చెరుకుపల్లి విష్ణు లపై చర్యలు తీసుకుని మా భూమి జోలికి రాకుండా చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.