30 July, 2026 | 9:22 AM

వీధి కుక్కల దాడిలో నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలు

30-07-2026 08:39 AM

ఇద్దరూ చిన్నారుల పరిస్థితి విషమం

నిజామాబాద్ ఆస్పత్రిలో వైద్య చికిత్సలు

కుక్కల బెడదను నివారించాలని మున్సిపల్ కమిషనర్ కు స్థానికుల డిమాండ్

బాన్సువాడ,జూలై 30 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో వివిధ కాలనీలలో మంగళవారం సాయంత్రం వీధి కుక్కల దాడిలో నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం, పిల్లలు ఇళ్ల ముందు ఆటలాడుకుంటుండగా ఒక్కసారిగా వీధి కుక్కల గుంపు వచ్చి దాడి చేసింది. పిల్లల కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని కుక్కలను తరిమికొట్టి పిల్లలను కాపాడారు. గాయపడిన వారిలో అర్ఫా ఫాతిమా - 13 సంవత్సరాలు,జైనబ్ - 3 సంవత్సరాలు,సాయి రిత్విక్ - 6 సంవత్సరాలు,అర్ష వర్ధిని - 10 సంవత్సరాలు,వీరిలో 3 ఏళ్ల జైనబ్,6 ఏళ్ల సాయి రిత్విక్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

మిగిలిన ఇద్దరు పిల్లలకు బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనతో బాన్సువాడ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పట్టణంలో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని, చిన్న పిల్లలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాన్సువాడ మున్సిపల్ కమీషనర్ ,చైర్‌పర్సన్ వెంటనే స్పందించి పట్టణంలోని వీధి కుక్కలను నియంత్రించి, అమాయక పిల్లల భద్రతను కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దని, వీధి కుక్కలు కనిపిస్తే దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.