భూ వివాదం నేపథ్యంలో హత్యాయత్నం: ఇద్దరు అరెస్ట్
నర్సాపూర్: భూ వివాదం నేపథ్యంలో హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను నర్సాపూర్ పోలీసులు(Narsapur Police) అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. గోమారం గ్రామానికి చెందిన పందిముక్కుల నర్సింలు గౌడ్ (63)తో అదే గ్రామానికి చెందిన పందిముక్కుల గోపాల్ గౌడ్ (41), పందిముక్కుల మనీష్ గౌడ్ (20)లకు పూర్వీకుల భూముల పంపకాల విషయంలో చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ భూ వివాదానికి సంబంధించి నర్సాపూర్ కోర్టులో సివిల్ కేసు విచారణలో ఉంది.
ఈ నెల 28న కోర్టు విచారణ అనంతరం నిందితులు రెండు మోటార్ సైకిళ్లపై బాధితుడిని వెంబడించి, నర్సాపూర్–చాకరిమెట్ల హనుమాన్ ఆలయం సమీప అటవీ ప్రాంతంలో అతని వాహనాన్ని ఢీకొట్టి కిందపడేశారు. అనంతరం హెల్మెట్, డీజిల్ డబ్బా, చేతులు, కాళ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అడ్డుకునేందుకు వచ్చిన వారిని కూడా బెదిరించినట్లు వెల్లడించారు. నిందితుల ఒప్పుకోలు, సాక్షుల వాంగ్మూలాలు, స్వాధీనం చేసిన వస్తువుల ఆధారంగా వారిని అరెస్ట్ చేసి, కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు నర్సాపూర్ ఎస్‌హెచ్‌వో ఏ. రంజిత్ కుమార్ తెలిపారు.






