మూడు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి
30-07-2026 08:44 AM
నర్సాపూర్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు గత మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ నర్సాపూర్ మండలానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు బుధవారం ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మూడు నెలలుగా వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కుటుంబ పోషణతో పాటు రోజువారీ అవసరాలు తీర్చుకోవడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభాకర్, వెంకటేష్, పోచయ్య, మహేందర్, సక్కుబాయి, యశోద తదితరులు పాల్గొన్నారు.






