భారీ వర్షాల నేపథ్యంలో పోలీసుల హెచ్చరిక
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భిక్కనూర్, జూలై 30(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భిక్కనూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జగడం నరేష్ సూచించారు. శిధిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించవద్దని, విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. వాగులు, వంకలు, చెరువులు, వరద ప్రవాహాలను దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించారు.
అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని, చిన్నారులు, వృద్ధులు, మహిళల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే 87126 86153 లేదా డయల్-100కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. వర్షాకాలంలో జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని, ప్రజలంతా పోలీసులకు సహకరించాలని సీఐ జగడం నరేష్ కోరారు.






