ఇరాన్ అణుశుద్ధి కేంద్రంపై దాడి
నంతాజ్‌పై అమెరికాెే-ఇజ్రాయెల్ వైమానిక దాడులు
రేడియోధార్మిక పదార్థాల లీకేజీ జరగలేదు
తీవ్రంగా ఖండించిన ఇరాన్ అణు ఇంధన సంస్థ
బాధ్యతారాహిత్యమేనన్న రష్యా
టెహ్రాన్ మార్చి 21: ఇజ్రాయెల్- ఇరాన్‌ల మధ్య దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా కొనసాగు తోంది. 22వ రోజైన శనివారం కూడా క్షిపణులు, డ్రోన్లతో బాంబుల మోత మోగింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు దాదాపు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై మరోసారి దాడులు జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అమెరికా దళాలు వైమానిక దాడులు చేశాయని పేర్కొంది.
అయితే, రేడియోధార్మిక పదార్థాల లీకేజీ జరగలేదని, పరిసర ప్రాంతా ల నివాసితులకు ఎలాంటి ప్రమాదమూ లేదని పేర్కొంది. ఈ దాడులను ఇరాన్ అణు ఇంధన సంస్థ తీవ్రంగా ఖండించింది. అమెరికా, ఇజ్రాయెల్ నేరపూరిత చర్యల్లో భాగం గానే నతాంజ్‌ను లక్ష్యంగా చేసుకున్నాయని ఆగ్రహించింది. ఈ దాడులు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ), ఇతర అణు భద్రత నిబంధనలు, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాయని పేర్కొంది. తాము జరిపిన దాడులతో ఇరాన్‌కు భారీ నష్టం వాటిల్లిందని, ఇక ఆ దేశానికి యురేనియం శుద్ధి, బాలిస్టిక్ క్షిపణుల తయారీ సామర్థ్యం లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించిన వేళ తాజా దాడులు జరగడం గమనార్హం.
పెద్దగా నష్టం లేదు..
యుద్ధం ప్రారంభమైన మొదటి వారంలోనే నతాంజ్‌పై ఓ సారి దాడి జరిగింది. అం తర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) ఈ విషయాన్ని ధ్రువీకరించింది. శాటిలైట్ చిత్రాల ఆధారంగా.. అనేక భవనాలు దెబ్బతిన్నట్లు వెల్లడించింది. అయితే, రేడియేషన్ లీకేజీ ఉండకపోవచ్చని, అణు కేంద్రానికీ పెద్దగా నష్టం లేదని తెలిపింది.
టెహ్రాన్‌కు దాదాపు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అణుశుద్ధి కేంద్రాన్ని గతేడాది సైతం అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నాయి. నంతాజ్‌పై దాడులను రష్యా కూడా తప్పు పట్టింది. వాటిని అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి బాధ్యతారాహిత్య దాడుల వల్ల పశ్చిమాసియా అంతటా పెను విపత్తుకు దారితీసే ముప్పును కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.




