ప్రశ్నిస్తే.. కరెంట్ కట్!
నాగోల్‌లోని రాజీవ్ స్వగృహ టౌన్‌షిప్‌లో దారుణం
వారం రోజులుగా చీకటిలో మగ్గిన కుటుంబం
ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించిన బాధితుడు
ఎల్బీనగర్, మే 28 : పెంచిన మెయింటనెన్స్ కాకుండా పాత పద్దతిలో మెయింటెన్స్ బిల్లు కట్టారని ఒక కుటుంబాన్ని బిల్డింగ్ కాంప్లెక్స్ కమిటీ సభ్యులు వారం రోజులుగా వేధిస్తున్నారు. రాజీవ్ స్వగృహ టౌన్ షిప్ కమిటీ సభ్యులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో వారం రోజులుగా బాధిత కుటుంబం చిన్నపిల్లలతో సహా చీకట్లో ఉన్న సంఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..
నాగోలు బండ్లగూడలోని రాజీవ్ స్వగృహలో సీ బ్లాక్ లో బీజే చక్రపాణి గతంలో ప్లాట్ కొనుగోలు చేసి కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. దీంతో అక్కడ ఉన్న అపార్ట్మెంట్ అసోసియేషన్ జరుపుతున్న ఆర్థిక లావాదేవీలు, సొసైటీ బైలాస్ నిబంధనలకు వ్యతిరేకంగా పెంచిన నిర్వహణ ఖర్చులపై చక్రపాణి ప్రశ్నించాడు. దీంతో అసోసియేషన్ సభ్యుల అహం దెబ్బతినడంతో ప్రతికారంగా అతడిని వేధింపులకు గురి చేస్తున్నారు. గత నాలుగు నెలలుగా అతడి ప్లాట్లకు తరుచుగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తూ కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
వారం రోజులుగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో చిన్నపిల్లలు ఉక్కపోతకతో తీవ్ర ఇబ్బంది పడుతుందన్నారు. దీనిపై బాధితుడు ప్రశ్నించడంతో కమిటీ సభ్యులు దౌర్జన్యం చేస్తున్నారు. తనను బిల్డింగ్ కాంప్లెక్స్ కమిటీ సభ్యులు విద్యుత్ సరఫరా నిలిపివేసి వేధింపులకు గురి చేస్తున్నారని బాధితుడు గురువారం నాగోల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చినప్పుడు కరెంట్ కనెక్షన్ పునరుద్ధరించి, పోలీసులు వెళ్లి పోగానే కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు.
దీంతో తనకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించాడు. వారం రోజులుగా కరెంట్ సరఫరా నిలిపివేసి, ఒక కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నవారిపై స్థానికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా బిల్డింగ్ కాంప్లెక్స్ నిర్వాహణ ఖర్చులు చెల్లిస్తున్నా ఇబ్బందులకు గురి చేస్తున్నవారిపై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని ఎస్సీ కమిషన్ అధికారులను బాధితుడు కోరారు.






