ఆసియాకప్ 2027 తేదీలు ఖరారు
ఢాకా, జూలై 7: వచ్చే ఏడాది జరగనున్న ఆసియాకప్ షెడ్యూల్ దాదాపుగా ఖరారైంది. ఈ టోర్నీకి సంబంధించిన ప్రతిపాదిత తేదీలు, వేదికలను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విడుదల చేసింది. వచ్చే ఏడాది జూన్ 18వ తేదీ నుంచి ఆసియాకప్ ప్రారంభం కానుంది. రెండు వారాల పాటు సాగే ఈ టోర్నీ జూలై 4న ముగియనుంది.
టోర్నీకి సంబంధించిన వేదికలపై రాబోయే కొన్ని రోజుల్లోనే ఆసియా క్రికెట్ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనుందని సమాచారం. గతంలో జరిగిన ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. అయితే, ఈసారి మాత్రం ఈ టోర్నమెంట్ వన్డే ఫార్మాట్లో జరగనుంది. వచ్చే ఏడాది ఐసీసీ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ జరగనుండటంతో, దానికి ముందు ఆసియా జట్లకు ఇదొక రిహార్సల్‌గా ఉపయోగపడుతుందని ఏసీసీ భావిస్తోంది.
బంగ్లాదేశ్‌లోని మీర్పూర్, చిట్టగాంగ్, సిథ్లెట్ వేదికల్లో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇప్పటికే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి అవసరమైన సమాచారాన్ని కోరింది. బంగ్లాదేశ్ చివరిసారిగా 2016వ సంవత్సరంలో ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఆ ఎడిషన్ ఫైనల్లో బంగ్లాను ఓడించి భారత్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ 11 ఏళ్లకు బంగ్లాదేశ్‌కు ఈ మెగా టోర్నీని నిర్వహించే అవకాశం దక్కింది.






