26 August, 2026 | 2:59 PM

శక్తి పథకాన్ని రద్దు చేయాలి

26-08-2026 01:45 PM

విద్యార్థులతో కలిసి పోస్ట్‌కార్డులపై నిరసన

ఉట్నూర్, ఆగస్టు 26(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన GO నంబర్ 97తో పాటు శక్తి పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యార్థులతో కలిసి బిఆర్ ఎస్ వి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ పోస్ట్‌కార్డులను పోస్టు చేశారు.  బుధవారం ఈ సందర్భంగా ధరణి రాజేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నిర్ణయాలు సాంకేతిక విద్యను, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపించారు. సాంకేతిక విద్యను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విషయంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు.

AITCE అనుమతులకు సంబంధించి స్పష్టత లేని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించిన విలువైన భూములు, వనరులను PPP విధానంలో నడుస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.స్కిల్ యూనివర్సిటీ చట్టం తీసుకొచ్చి రెండేళ్లు పూర్తయినప్పటికీ విద్యార్థుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదని, అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ప్రయోగాలకు గురిచేయడం ఎందుకని ధరణి రాజేష్ ప్రశ్నించారు.

శక్తి పథకంతో పాటు GO నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను యథావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలిగించే నిర్ణయాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే, బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ధరణి రాజేష్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అజ్మీరా జయ చంద్ర రాథోడ్ అన్వేష్,సాజిద్ సిద్దిక్, మహేష్ మదాసు దినేష్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.