21 March, 2026 | 4:25 AM

మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఆశా కార్యకర్తల ధర్నా

21-03-2026 01:14 AM

వరంగల్, మార్చి 20 (విజయక్రాంతి): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు నెలకు 18,000 ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండలోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేష్ మాట్లాడుతూఎన్నికల మేనిఫెస్టోలో ఆశాలకు ఇచ్చిన హామీ మేరకు, ముఖ్యమంత్రి జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో 18 వేల రూపాయల ఫికస్డ్ వేతనం నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సుందరయ్య కార్యాలయం నుండి భారీ ర్యాలీగా బయలుదేరిన హనుమకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన ఆశాలు ఫికస్డ్ వేతనం ఇవ్వాలని, ఆశల సమస్యలను పరిష్కరించాలని దారి పొడుగునా నినాదాలు చేస్తూ కొండ సురేఖ ఇంటికి చేరుకున్నారు. మంత్రి ఇంటి వద్ద భారీ కేడ్లను అమర్చి లోనికి వెళ్లకుండా సుబేదారి సిఐ, ఏసిపి ల  పర్యవేక్షణలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

లోపలికి వెళ్లే ప్రయత్నం చేసిన సిఐటియు నాయకులు, ఆశలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో రెండు గంటలకు పైగా అక్కడే బయట నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకమైన నినాదాలు పెద్ద ఎత్తున చేశారు.ఆశాలను నాలుగవ తరగతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని డిమాండ్ చేస్తూ మార్చి 28వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆశాలు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ సిఐటియు నాయకులు సుంచు రాజేశ్వరి, బైరి శోభ, జనగాం శ్వేత, సిహెచ్ శ్రీవాణి, పద్మ, సిహెచ్ రాణి, రమ, కవిత, రజిత, ఈసంపల్లి శోభ, కరుణలత,లీల, పుష్ప, ప్రేమలత పాల్గొన్నారు.