2 March, 2026 | 4:21 AM

మేం అర్హులం కాదా?

02-03-2026 02:21 AM
  1. రాజ్యసభకు మమ్మల్ని పంపరా?
  2. మా ఓట్లు కావాలి.. సీట్లు ఇవ్వరా?
  3. రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తున్న దళిత, గిరిజన వర్గాలు
  4. రాష్ట్ర విభజన నాటి నుంచి పెద్దల సభ చూడని ఎస్సీ, ఎస్టీలు 
  5. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు దొందూదొందే అంటూ విమర్శలు 
  6. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించాలని డిమాండ్ 
  7. బీసీలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌కు సొంత పార్టీ నేతల ఒత్తిడి

హైదరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి) : ‘రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిపించుకునేందుకు మా ఓట్లు కావాలి. ఆ తర్వాత  రాజ్యసభ లేదా శాసన మండలి సభ్యుల ఎంపిక వరకు వచ్చేసరికి..  మేం అర్హులం కాకుండా పోతున్నాం. నామినేటెడ్  సీట్లు ఇవ్వడానికి ఏ పార్టీకి మనుసు రావడం లేదు’ అని దళిత, గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

రాజ్యసభ అభ్యర్థుల ఎంపి కలో  దళిత, గిరిజన వర్గాలను రాజకీయ పార్టీలన్నీ చిన్న చూపు చూస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశలో ఒకటి, రెండు సార్లు ఎస్సీ, ఎస్టీ వర్గాలను పెద్దల సభకు పంపిన చరి త్ర ఉండగా, రాష్ట్ర విభజన తర్వాత కనీసం ఒక్కరిని కూడా పంపలేదు. ప్రస్తుతం రాజ్యసభ, మండలి సభ్యుల ఎన్నికల్లో సామాజిక న్యాయం పాటించాలనే  బలంగా వినిపిస్తోంది. 

రెండో సీటూ ఓసీకేనంటూ..

తెలంగాణలో ప్రస్తుతం  రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఆ రెండు సీట్లు అధికార కాంగ్రెస్‌కు హస్తగతమయ్యే అవకాశం ఉంది. ఒక రాజ్యసభ సీటుకు సరిపోను మెజార్టీ ఉన్నప్పటికీ.. రెండో సీటు గెలుపొందేందుకు ఇతర పార్టీల మద్దతు అవసరం ఉంటుంది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో పాటు ఎంఐఎం, సీపీఐతో కలిసి రెండు సీటు గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. 

ఒక సీటు కాంగ్రెస్ అధిష్ఠానం కోటాలో ఆ పార్టీ సీనియర్ నేత, ప్రస్త్తుత రాజ్యసభ సభ్యుడు  అభిషేక్ మను సింఘ్వీకి మళ్లీ రెన్యువల్ చేయనున్నారు. అయితే  మిగిలిన ఒక సీటుకు కోసం ఏడేనిమిది మంది పోటీ పడుతున్నారు. ఒక వైపు నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మరో వైపు నామినేషన్ల చివరి తేదీ ఈ నెల ఐదో తేదీన ముగియనుంది. కానీ, రాజ్యసభ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రకటించలేదు.

అయితే రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రెండింటలో ఒకటి అధిష్ఠానం కోటాలో వెళితే.. రెండో సీటు విషయంలో సామాజిక న్యాయం పాటించాలని సొంత పార్టీ నేతలతో పాటు దళిత, గిరిజన, బీసీ సంఘాల నాయకులు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం రెండో సీటును కూడా ఓసీ సామాజిక వర్గానికి కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా గాంధీభవన్ వర్గాలు చెబతున్నాయి.  

తెలంగాణ నుంచి ఏడుగురు..

తెలంగాణ నుంచి ప్రస్తుతం ఏడుగురు రాజ్యసభ సభ్యులున్నారు. కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బీఆర్‌ఎస్ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులున్నారు. కాంగ్రెస్‌కు చెందిన వారిలో అభిషేక్ మనుసింఘ్వీ ( ఓసీ), రేణుకాచౌదరి ( ఓసీ), మందాడి అనిల్‌కుమార్ యాదవ్ (బీసీ) రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఇక బీఆర్‌ఎస్ నుంచి బి. పార్థసారథిరెడ్డి ( ఓసీ), డి. దామోదర్‌రావు ( ఓసీ), కేఆర్ సురేష్‌రెడ్డి ( ఓసీ), వద్దిరాజు రవిచంద్ర ( బీసీ) రాజ్యసభ ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

వీరిలో కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ, బీఆర్‌ఎస్ సభ్యుడు కేఆర్ సురేష్‌రెడ్డిల పదవీ కాలం  వచ్చే ఏప్రిల్ 9వ తేదీన  ముగుస్తుంది. అయితే రాష్ట్ర విభజన నాటి నుంచి ఇప్పటీ వరకు జరిగిన రాజ్యసభ అభ్యర్థులు ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ఎస్సీ, ఎస్టీలకు అవకాశం ఇవ్వలేదు. పదేళ్ల బీఆర్‌ఎస్ హయంలో ఎస్సీ, ఎస్టీలు విస్మరణకు గురైతే.. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా అదే జరుగుతోందనే వాదనలు ఉన్నాయి.