17 May, 2026 | 2:46 AM

గుజరాత్ జోరుకు బ్రేక్

17-05-2026 01:30 AM

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ముంగిట గుజరాత్ టైటాన్స్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు వరుస విజయాలకు బ్రేక్ వేస్తూ కోల్‌కతా నైట్‌రైడర్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌లో ఫిన్ అలెన్, రఘువంశీ, గ్రీన్ విధ్వంసం సృష్టించడంతో 248 పరుగుల భారీస్కోరు చేసింది. ఛేజింగ్‌లో గుజరాత్ కూడా పోరాడినా కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం కొంపముంచింది. ఈ విజయంతో కేకేఆర్ ప్లే ఆఫ్ అవకాశాలు నిలుపుకోగా.. పాయింట్ల పట్టికలో గుజరాత్ రెండో స్థానంలోనే కొనసాగుతోంది.

  1. టైటాన్స్‌కు షాకిచ్చిన కోల్‌కతా
  2. కేకేఆర్ బ్యాటర్ల విధ్వంసం
  3. ఛేజింగ్‌లో సరిపోని గుజరాత్ పోరాటం
  4. కోల్‌కతా ప్లే ఆఫ్ ఆశలు సజీవం

కోల్‌కతా, మే 16 : ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచడమే లక్ష్యంగా దూకుడుగా బ్యాటింగ్ చేసింది. ఫిన్ అలెన్, రహానే తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించారు. రహానే 14 పరుగులకు ఔటవగా.. పవర్ ప్లేలో కోల్‌కతా 56 పరుగులు చేసింది. ఇక్కడ నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్ స్కోరు బోర్డు టాప్ గేర్‌లో సాగింది. ఫిన్ అలెన్, రఘువంశీ గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.

భారీ సిక్సర్లు, బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించారు. పిచ్ ఫ్లాట్‌గా ఉండడంతో పరుగుల వరద పారింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 41 బంతుల్లోనే 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. తర్వాత మరింత రెచ్చిపోయిన అలెన్ సెంచరీ సాధించేలా కనిపించాడు. చివరికి భారీ షాట్ కొట్టే క్రమంలో 93(35 బంతులు) పరుగులు దగ్గర ఔటయ్యాడు. ఫిన్ అలెన్ ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి.

ఆ తర్వాత రఘువంశీకి, కామెరూన్ గ్రీన్ జత కలిసాడు. వీరిద్దరూ అదే దూకుడు కొనసాగిస్తూ స్కోరు మరింత పెంచారు.  రఘువంశీ, గ్రీన్ 52 బంతుల్లోనే 108 పరుగులు జోడించారు. వీరిద్దరి విధ్వంసంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 247 పరుగులు చేసింది. రఘువంశీ 44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 82 , కామెరూన్ గ్రీన్ 28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లర్ 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. కోల్‌కతా ఇన్నింగ్స్‌లో ఏకంగా 22 సిక్సర్లు నమోదయ్యాయి.

కేకేఆర్ ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక సిక్సర్ల రికార్డు. అటు కోల్‌కతా బ్యాటర్ల విధ్వంసానికి గుజరాత్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మరోవైపు ఛేజింగ్‌లో గుజరాత్ టైటాన్స్ కూడా రెచ్చిపోయింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూ లంగా ఉండడంతో దూకుడుగా ఆ డింది. గత ఐదు మ్యాచ్‌లలోనూ అద్భుతమైన ఆరంభాలనిచ్చిన గిల్, సాయి సుదర్శన్ జోడీ ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించింది. అయితే సాయి సుదర్శన్ గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో వారి జోరుకు బ్రేక్ పడినట్టయింది. నిశాంత్ సంధు(1) నిరాశ పరిచినా బట్లర్, గిల్ జోడీ పోరాడారు. వీరిద్దరూ భారీ షాట్లతో కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపించారు.

ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. బట్లర్, గిల్ మూడో వికెట్‌కు 73 బంతుల్లోనే 128 పరుగులు జోడించారు. గిల్ 49 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 85 పరుగులకు ఔటయ్యాడు. దీంతో వీరి పార్టనర్‌షిప్‌కు బ్రేక్ పడింది. గాయంతోనే మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన సాయి సుదర్శన్ గుజరా త్‌ను గెలిపించేందుకు చివరి వరకూ పోరాడాడు. కానీ చివర్లో కోల్‌కతా బౌలర్లు పుం జుకుని బట్లర్ వికెట్ తీయ డం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా చెప్పొచ్చు.

బట్లర్ 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 రన్స్‌కు వెనుదిరిగాడు. సాయి సుదర్శన్ పోరాడినా కోల్‌కతా బౌలర్లు చివర్లో కట్టడి చేయగలిగారు. ఫలితంగా గుజరాత్ 20 ఓవర్లలో 218 పరుగులు చేయగలిగింది. సాయి సుదర్శన్ 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ విజయంతో కోల్‌కతా ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉన్నా యి. కాగా వరుసగా ఐదు విజయాల తర్వాత గుజరాత్‌కు ఇదే తొలి ఓటమి.

స్కోరు బోర్డు

కోల్‌కతా ఇన్నింగ్స్ : 247/2 ( ఫిన్ అలెన్ 93, రఘువంశీ 82 నాటౌట్, గ్రీన్ 52 నాటౌట్ ; సిరాజ్ 1/50, హోల్డర్ 1/38)

గుజరాత్ ఇన్నింగ్స్ : 218/4 ( గిల్ 85, బట్లర్ 57, సాయి సుదర్శన్ 53 నాటౌట్ ; నరైన్ 2/29, దూబే 1/23, గ్రీన్ 1/25 )