17 May, 2026 | 1:18 AM

‘చెత్త’ ట్రాక్టర్లలో మక్కల తరలింపు?

17-05-2026 12:12 AM

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో జీపీల చెత్త సేకరణ ట్రాక్టర్లలో మక్కల తరలింపు

మహబూబాబాద్, మే 16 (విజయక్రాం తి): గ్రామాల్లో చెత్త తరలింపునకు వినియోగించాల్సిన ట్రాక్టర్లను మక్కల తరలింపునకు వినియోగించడం వివాదాస్పదంగా మారింది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రం నుంచి గోదాముకు మక్కలను తరలించడానికి మండలానికి చెందిన ఐదు గ్రామ పంచాయతీల చెత్త ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు.

కొనుగోలు కేంద్రం నుంచి గోదాముకు కొన్ని ప్రైవేట్ ట్రాక్టర్లను ఏర్పాటు చేసినప్పటికీ కార్మికులు వాటిని లోడ్ చేసిన తర్వాత కొంత సమయం మిగిలి ఉండటంతో గ్రామపంచాయతీ ట్రాక్టర్లను ఆ సమయంలో వినియోగిస్తున్నట్లు ఎంపీడీవో కుమార్ పేర్కొన్నారు. అయితే గ్రామాల్లో పేరుకుపోయిన చెత్త తొలగించడానికి ట్రాక్టర్లలో డీజిల్ లేదని, బిల్లులు సకాలంలో ఇవ్వడం లేదని కుంటి సాకులు చెప్పి దాటవేసే ధోరణి అవలంబించే అధికారులు ఇలా మక్కల తరలింపునకు జీపీ ట్రాక్టర్లను వినియోగించడం ఏమిటనే విమర్శలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

మక్కల తరలింపు కోసం కాంట్రాక్టర్‌ను మార్క్ ఫెడ్ సంస్థ నియమించినప్పటికీ, గ్రామపంచాయతీ ట్రాక్టర్లను వినియోగించడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంపై ఎంపీడీవోను వివరణ కోరగా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని, వాతావరణ మార్పుల కారణంగా, కార్మికులు కొంతసేపు ఖాళీగా ఉంటుండటంతో సమీప దూరంలో ఉన్న గోదాముకు మక్కలను తరలించేందుకు తామే ఐదు గ్రామ పంచాయతీలకు చెందిన ట్రాక్టర్లను వినియోగిస్తున్నామని, ఒక్కో ట్రాక్టర్లో 50 చొప్పున మాత్రమే మక్కల బస్తాలను గోదాంకు తరలిస్తున్నట్లు ఆయన చెప్పారు.