ధాన్యం, బియ్యం మధ్యలో.. నూకల తకరారు!
- కేంద్రం నిబంధనల ప్రకారం ధాన్యం తీసుకోలేమంటున్న రైస్ మిల్లర్లు
- రా రైస్ 67% .. బాయిల్డ్ రైస్ 68% ఇవ్వలేం
- 10 శాతం నూకతో.. రా రైస్ అసాధ్యమని చేతులెత్తేస్తున్న మిల్లర్లు
- కొనుగోలు కేంద్రాల్లో.. రైతుల వద్ద పేరుకుపోతున్న ధాన్యం
- క్షేత్రస్థాయి పరిస్థితులకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు
- అదనంగా 30 లక్షల టన్నుల బియ్యంపైనే అసలు పంచాయితీ!
* నూకల జగడం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అటు రైతులకు, ఇటు రైస్ మిల్లర్లకు మధ్య ఇది తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా చేస్తున్నా, తాము దింపుకోలేమంటూ కుండబద్దలు కొట్టినట్టుగా రైస్ మిల్లర్లు చెబుతున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, రైస్ మిల్లర్లకు ఎదురయ్యే కష్టాలను తొలగిస్తూ..
సాఫీగా ధాన్యం కొనుగోళ్లు జరిపేలా చూసి, కావాల్సిన బియ్యాన్ని సేకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా, అసంబద్ధంగా రూపొందించిన నిబంధనల ఫలితమే.. ఈ నూకల జగడం. వాస్తవ పరిస్థితులను తెలిపినా, అటు కేంద్రం నుంచిగానీ.. ఇటు రాష్ట్రం నుంచిగానీ సానుకూల స్పందన రాకపోవడంతో చేసేదేమీ లేక రైస్ మిల్లర్లు సహాయనిరాకణకు దిగుతున్నారు. ఇంతకి ఏమిటీ ‘నూకల’ జగడం..?
హైదరాబాద్, మే ౧౬ (విజయక్రాంతి): ఒక క్వింటాలు ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఎంతమేర బియ్యాన్ని ఇవ్వాలనేదానిపై రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. ఇందులో పాత పద్ధతిలో అయితే.. ముడి బియ్యం (రా రైస్) విషయంలో 25 శాతం బ్రోకెన్ (నూక శాతం)తో కలుపుకుని 67 శాతం బియ్యం ఇవ్వాలని నిబంధన ఉంది.
అంటే క్వింటాలు ధాన్యం మిల్లింగ్‌చేసి 67 కిలోల రా రైస్ ఇవ్వాలన్నమాట. ఇందులో 25 శాతం వరకు నూకలు ఉండవచ్చు. అదే బాయిల్డ్ రైస్ విషయంలో అయితే 15 శాతం నూకలతో 68 శాతం బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం కొంత ఇబ్బందికి అవకాశం ఉన్నా.. కిందామీద
పడి రైస్ మిల్లర్లు నిబంధనల ప్రకారమే బియ్యం ఇస్తూ వస్తున్నారు. అయితే తాజాగా (రబీ)లో మరో 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసేలా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పించారు. అందుకు అనుగుణంగానే సాధారణంగా ఉండే కోటాకు అదనంగా మరో 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసి తీసుకునేందుకు కేంద్రం (ఎఫ్‌సీఐ) అంగీకరించింది.
హమ్మయ్య అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. అక్కడే అసలు తకరారు మొదలయ్యింది.అదనంగా తీసుకునే 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం విషయంలో ఒక క్వింటాలు ధాన్యానికి ఇవ్వాల్సిన బియ్యం విషయంలో కేంద్రం పాత పద్ధతిని పక్కన పెట్టి కొత్త మార్గదర్శకాలను, నిబంధనలను రూపొందించి.. వాటి ప్రకారమే బియ్యం ఇవ్వాలంటూ హుకుం జారీచేసింది.
దీనిని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లకు పురమాయించింది. రా రైస్ విషయంలో 10 శాతం నూకలతో.. 67 శాతం బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే బాయిల్డ్ రైస్ విషయంలో 5 శాతం నూకలతో 68 శాతం బియ్యాన్ని ఇవ్వాలని కేంద్రం నిబంధనలను రూపొందించింది.
36 డిగ్రీల వరకు పరవా లేదు
నిజానికి పాత పద్ధతిలో రారైస్ అయితే 25 శాతం బ్రోకెన్, బాయిల్డ్ రైస్ అయితే 15 శాతం బ్రోకెన్‌తో బియ్యం ఇవ్వడానికి రైస్ మిల్లర్లకు కాస్త ఇబ్బంది అయినా.. పాటిస్తూ వస్తున్నారు. అయితే అదనంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం విషయంలో ఈ నిబంధనలను పూర్తిగా మార్చివేసి రా రైస్ అయితే 10 శాతం నూకతో.. బాయిల్డ్ రైస్ అయితే 5 శాతం నూకతో ఇవ్వాలని కేంద్రం విధించిన నిబంధనలను పేర్కొంటూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో రాష్ట్రంలోని రైస్ మిల్లర్ల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యింది.
వాస్తవంగా ఉష్ణోగ్రతల ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోకుండా సిద్ధంచేసిన నిబంధనలు పాటించడం ఈ రబీలో కష్టమని మిల్లర్లు తేల్చి చెబుతున్నారు. సాధారణంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు రా రైస్ అయితే 25 శాతం నూకతో 67 శాతం బియ్యాన్ని.. బాయిల్డ్ రైస్ అయితే 15 శాతం నూకతో 68 శాతం బియ్యాన్ని ఇవ్వవచ్చు. కానీ.. ప్రస్తుతం రాష్ట్రంలో 43 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి.
ఈ వేసవిలో 46 డిగ్రీలకుపైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోందికూడా. ఈ నేపథ్యంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ధాన్యం మిల్లింగ్ చేస్తే.. 25 శాతానికి మించి నూకలు వస్తాయని.. అప్పుడు 67 శాతం రైస్, 68 శాతం బాయిల్డ్ రైస్ రావు. మరి ప్రభుత్వానికి బియ్యాన్ని ఎలా ఇవ్వాలని మిల్లర్లు అడుగుతున్నారు. అందుకే తాము పీకల్లోతు నష్టాల్లో ముంచే అవకాశం ఉన్న ఈ నిబంధనల ప్రకారం బియ్యాన్ని ఇవ్వలేమని కరాకండిగా చెబుతూ.. జిల్లాల వారీగా, రాష్ట్ర స్థాయిలోనూ అధికారులకు విజ్ఞాపన పత్రాలు అందిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మరో తకరారు..
ఇదిలా ఉండగా, కేంద్రం నుంచి వచ్చిన 10 శాతం నూకతో 67 శాతం రా రైస్ బియ్యం ఇవ్వాలనే నిబంధనను యధాతథంగా అమలుచేస్తూ, అదనంగా వచ్చే నూకలను అలాగే మిల్లర్ల వద్ద నిల్వ చేసుకోవాలని, కేంద్రం నుంచి (ఎఫ్‌సీఐ) వచ్చే తదుపరి ఉత్తర్వుల ప్రకారం ఆ నూకలను ఏం చేయాలనేది నిర్ణయిస్తామని పౌర సరఫరాల శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఇక్కడే మిల్లర్లు మరోసారి తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు.
అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా 25 శాతానికి మించి నూకలు వచ్చే నేపథ్యంలో.. 10 శాతం నూకలతో 67 శాతం రారైస్‌ను, అలాగే 5 శాతం నూకలతో 68 శాతం బాయిల్డ్ రైస్‌ను ఇవ్వడం ఎలా సాధ్యమంటూ మిల్లర్లు గగ్గోలు పెడుతున్నారు. వాస్తవ వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. రా రైస్ అయితే 25 శాతానికిపైగా, బాయిల్డ్ రైస్ అయితే 15 శాతానికిపైగా నూకలతో ఇవ్వాలనే నిబంధనలు ఉండాలని..
కానీ అందుకు విరుద్ధంగా 10 శాతం, 5 శాతం నూకలతో ఇవ్వాలని ఆదేశించడం.. పైగా అదే ఉత్తర్వుల్లో.. మిగిలిన15 శాతం నూకలను రైస్ మిల్లర్ల వద్దే నిల్వ చేయాలని చెప్పడంపై లబోదిబోమంటున్నారు. అంటే ఒకపక్క 25 శాతం నూకలు రావడం సహజమని ఒప్పుకుంటూనే.. 10 శాతం నూకలతో బియ్యాన్ని సెంట్రల్ ఫూల్ కింద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)కి ఇవ్వాలని చెప్పడంతో నోరెళ్ళబెడుతున్నారు.
అక్రమాలు చేయాలా?.. ఆస్తులు అమ్ముకోవాలా?..
కేంద్రం రూపొందించిన నిబంధనలను ఒప్పుకుని బియ్యం ఇవ్వాలంటే (10 శాతం, 5 శాతం నూకలతో) అక్రమాలు చే యాల్సిందేనంటూ రైస్ మిల్లర్లు వాపోతున్నారు. నిబంధనల పేరుతో మిల్లర్లను అక్ర మాలు చేసుకునేలా మళ్ళిస్తున్నారా అం టూ మండిపడుతున్నారు. పైగా 25 శాతం నూకలు వస్తాయని చెబుతూనే, 10 శాతం నూకలతో ఎఫ్‌సీఐకి బియ్యం సరఫరా చేయాలని.. మిగిలిన 15 శాతం నూకలను ఏం చేయాలనేది తరువాత నిర్ణయం తీసుకుంటాం.. అప్పటి వరకు మీరే భద్రప ర్చాలని చెప్పడంతో.. వాటిని సంరక్షించలేక.. ఇటు ఇవ్వాల్సినంత బియ్యాన్ని ఇవ్వ లేక.. అక్రమాలకు పాల్పడటమో.. లేక ఆస్తులను అమ్ముకోవడం తప్పితే గత్యంతరం లేదని మిల్లర్లు వాపోతున్నారు.
దించుకోం గాక.. దించుకోం..
ఈ నూకల కయ్యం కారణంగానే.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్ళకు అనుగుణంగా రవాణా వేగంగా సాగడం లేదు. ఈ నిబంధనల ప్రకారం తాము బియ్యం ఇవ్వలేమని, అందుకే తాము ధాన్యం తీసుకోమంటూ రైస్ మిల్లర్లు భీష్మించారు. బలవంతంగా లారీల్లో ధాన్యాన్ని పంపిస్తున్నప్పటికీ.. దింపుకోకుండా మిల్లర్లు వెనక్కి పంపించడమో.. లేక వెయిటింగ్‌లో పెట్టడమో చేస్తున్నట్టుగా సమాచారం.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా లారీల కొరత, పేరుకు పోయిన ధాన్యం.. కొనుగోళ్లలో స్థంభన.. వెరసి రైతన్నలు రోడ్లపైకి వస్తున్నట్టుగా అధికారులుకూడా అంచనావేస్తున్నారు. మొత్తానికి కేంద్రం రూపొందించిన ‘నూకల’ శాతం కాస్తా.. ప్రభుత్వం, రైస్ మిల్లర్ల మధ్యన యుద్ధంగా మారడంతో.. ఆ ప్రభావం రాష్ట్ర రైతాంగానికి చుట్టుకుంది.
అటు ప్రభుత్వం, ఇటు రైతులు.. మరోవంక రైస్ మిల్లర్ల మధ్యన ట్రయాంగిల్ వార్‌లా మారింది. దీనిపై ప్రభుత్వమే చొరవ తీసుకుని ఉష్ణోగ్రతను దృష్టిలో పెట్టుకుని నిబంధనలు మార్చితే.. ధాన్యాన్ని తీసుకోవడానికి సిద్ధమంటూ రైస్ మిల్లర్లు చెబుతున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి..!






