17 August, 2026 | 5:06 AM

‘అడుగంటు’తున్న ఆశలు!

17-08-2026 02:22 AM
  1. ఎల్‌నినోతో జాడ లేని వానలు 
  2. ఎండుతున్న చెరువులు 
  3. చి‘వరి’ సాగుపై అనిచ్చితి 

మహబూబాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానాకాలం పంటల సాగుపై అన్నదాతల ఆశలు రోజురోజుకు అడుగంటిపోతున్నాయి. వర్షాకాలంలో ఆగస్టు మూడో వారం వచ్చినప్పటికీ ఆశించిన వర్షాలు కురవకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పంటల సాగుపై వర్షాభావ ప్రభావం తీవ్రంగా నెలకొంది. ఆశించిన వర్షాలు కురవకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధాన జలాశయాలు, చెరువులు, కుంటలు అడుగంటి పోయాయి.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మినహా మిగిలిన మహబూబాబాద్, జనగామ, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో లోటు వర్షపాతం వల్ల భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. ఈ జిల్లాలో వ్యవసాయ బావులతో పాటు తాగునీటి అవసరాలకు కూడా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో అందులో ఆగస్టు నెలలో వ్యవసాయ బావుల నిండా భూగర్భ జలాలు ఉప్పొంగి జలకళ తో కళకళలాడాల్సిన పరిస్థితికి భిన్నంగా అడుగంటిన వ్యవసాయ బావులు చూసి రైతులు బావురు మంటున్నారు.

చెరువులు, కుంటల్లో నీరు లేక బీడు భూములను తలపిస్తుండగా, చెరువులు కుంటల కింద వరి నాట్లు వేయడానికి నీరు లేక వరి సాగు విస్తీర్ణం ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదు. అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలతో పునాస పంటలతో పాటు, ఆడుతాడి పంటలు కాస్త ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఖరీఫ్ సీజన్ లో ప్రధాన పంట వరి సాగు పై నీలి నీడలు కమ్ముకున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అక్కడక్కడ వారి నాట్లు వేయగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ వాన కాలంలో వరి సాగు విస్తీర్ణం సగానికి కూడా చేరుకోలేకపోవడం వరంగల్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.

వరంగల్ జిల్లాలో కేవలం 40 వేల ఎకరాల్లో వరి సాగు  నాట్లు వేయగా, మహబూబాబాద్ లో 80 వేల ఎకరాలు, ములుగులో 43 వేల ఎకరాలు, హనుమకొండలో 85వేల ఎకరాలు, భూపాలపల్లి జిల్లాలో 72 వేల ఎకరాలు, జనగామ జిల్లాలో 1,25,000 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. వానాకాలంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో సాధారణ వరి సాగు విస్తీర్ణం కాగా, 5 లక్షల ఎకరాలకు మించి వరి నాట్లు పడలేదు. 

వ్యవసాయ శాఖ సూచనలతో..

ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో ఆరుతడి పంటలే మేలని వ్యవసాయ శాఖ, ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరి నాట్లు మందగించాయి. ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు, కూరగాయల సాగు, ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుకు అన్నదాతలు ముందుకు సాగుతున్నారు.

వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి సన్నద్ధం చేయడానికి అవగాహన సదస్సులు, విత్తన మేళాలు నిర్వహించి, ఎల్ నినో ప్రభావం తీవ్రతను వివరించింది. దీని ఫలితంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటల సాగు వైపు అన్నదాతలు మొగ్గుచూపుతున్నారు. దీనితో ఈ వానాకాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరి సాగు విస్తీర్ణం సగానికి పరిమితం కానుంది.