8 August, 2026 | 11:20 PM

నూతన పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం

08-08-2026 08:10 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మల్లాపూర్ మండలంలో అర్హులైన అభ్యర్థుల నుంచి నూతన పెన్షన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి అలువాల శ్రీకాంత్ తెలిపారు.అర్హత కలిగిన వారికి నూతన పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. నూతనంగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారిలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు,కల్లుగీత కార్మికులు, ఫైలేరియా, హెచ్‌ఐవీ బాధితులు, డయాలసిస్ కేటగిరీలకు చెందిన అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

దరఖాస్తుతో పాటు దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, వయస్సు ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు/ఆదాయ ధ్రువీకరణ పత్రం, సంబంధిత కేటగిరీ ధ్రువీకరణ పత్రాలు జత చేయాలని సూచించారు.సంబంధిత కేటగిరీలకు అనుగుణంగా సదరం, యూడీఐడీ, వితంతు, దివ్యాంగ, చేనేత, కల్లుగీత తదితర ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు నూతన దరఖాస్తుతో పాటు అవసరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలను జతచేసి తమ గ్రామ పంచాయతీ కార్యదర్శికి అందజేయాలని ఎంపీడీఓ శ్రీకాంత్ సూచించారు. దరఖాస్తులు, అర్హతలు, ఇతర వివరాల కోసం సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయంలో లేదా మల్లాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు. అర్హులైన ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.