7 July, 2026 | 3:52 PM

Breaking News

భూ భారతిలో భారీ అక్రమాలు: RS Praveen Kumar సంచలన వ్యాఖ్యలు   •   అంటు వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి   •   ముఖ్యమంత్రి దృష్టికి మహార్ కుల సమస్యలు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తా   •   సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •  

కాళ్లు మొక్కుతా బాంఛన్.. వడ్లు కొనండి

08-05-2026 09:20 AM

కన్నీటితో వేడుకున్నా.. కనికరం లేదాయే.

దేశానికి అన్నంపెట్టే రైతు దుస్థితి మంచిర్యాలలో ఇలా.

అధికారుల చేతగాని తనంతో తప్పని తిప్పలు.

మంచిర్యాల, (విజయక్రాంతి) : కాళ్లు మొక్కుతా బాంఛన్.. జర మా వడ్లు కొనండి... అంటూ అధికారుల కాళ్లు మొక్కే దుస్థితి మంచిర్యాల జిల్లాలో రైతులకు ఏర్పడింది... కాదు ఏర్పడేలా చేతగాని అధికారుల పని తీరుతో దాపురించింది... అన్నీ సక్రమంగానే ఉన్నాయి.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవంటూ జిల్లా బాస్ కు, మంత్రులకు, ఎంఎల్ఏలకు అధికారులు చెప్పుతుండటంతో అదే నమ్ముతున్నారు కానీ క్షేత్ర స్థాయిలో రైతుల కష్టాలు తెలుసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. రాజులా ఉండాల్సిన రైతులు ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వ అధికారుల కాళ్లు పట్టే పరిస్థితికి దిగజారడానికి కారకులైన పాలకులు కొంత సోయికి రావాలి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అధికారుల నిర్లక్ష్యంతో తూకం వేసిన బస్తాలు, ఆరబోసిన ధాన్యం వరణుడి పాలైతుంటే నాయకులేమో పట్టణాల్లో ఉండి చోధ్యం చూస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

రైతులను పట్టించుకోని నాయకులు

ఎలక్షన్లలో వంగి వంగి నమస్కారాలు పెట్టిన నాయకులు గెలిచిన తర్వాత కడుపుసల్ల కదలకుండా ఉంటున్నారే తప్ప రైతుల కష్టాలను తిరిగి పరిశీలించిన దాఖలాలు లేవని రైతులు ఆవేదనతో పేర్కొంటున్నారు. జిల్లాలో మంత్రి(గడ్డం వివేక్ వెంకటస్వామి), ఎంపీ (గడ్డం వంశీ కృష్ణ), ఎంఎల్ఏ(కొక్కిరాల ప్రేంసాగర్ రావు, గడ్డం వినోద్) లు పేరుకే ఉన్నారు తప్పా వారు చేస్తుంది ఏంటని రైతులు కన్నెర్ర చేస్తున్నారు. రైతులు చస్తే రారు.., రైతులు గోస పడుతుంటే రారు.. ఇక మిమ్మల్ని గెలిపించుకుంది ఎందుకని ప్రశ్నిస్తున్నారు. రైతు కష్టం విలువ ఎవరూ పట్టించుకోకపోవడం వల్లనే నేడు రైతులు అధికారులకు కాళ్లు మోకే పరిస్థితికి దాపురించిందని, అయినా కనికరం లేదని వాపోతున్నారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదని, ఇది నాయకులు గమనించాలని కన్నీరు పెడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అధికారుల చేతగాని తనంతో తప్పని తిప్పలు

జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసేందుకు అవసరమైన గన్నీ సంచులు, తరలించేందుకు లారీలను ముందుగానే అంఛనా వేసి సిద్ధంగా ఉంచాల్సిన అధికారులు పట్టింపులేని తనంతో రైతుకు కష్టాలు తప్పడం లేదు. లారీ రావాలంటే పైసలే.. మిల్లులో దిగాలంటే కోతలే... ఈ రెండింటికి రైతు ఒప్పుకుంటేనే వడ్లుపోయేటిది. లారీ కాంట్రాక్టర్ల వద్ద, మిల్లర్ల వద్ద లక్షల్లో తీసుకుంటున్న అధికారులు వారిని ఏమనలేక నోరుమూసుకొని ఉంటున్నారని, ఈ పరిస్థితికి కారణమయ్యారని రైతులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. పుండోకాడ ఉంటే మందు మరోకాడ రాసినట్టు అధికారుల తీరును గమనిస్తే అర్థమవుతుందని, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతుంటే సంబంధిత శాఖ అధికారులు మిల్లుల వద్ద ఫొటోలు దిగుతూ వస్తున్నారు తప్ప సమస్య ఉన్నచోటికి రావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.