8 May, 2026 | 9:49 AM

రోడ్డు ఆక్రమణను అరికట్టాలి

08-05-2026 09:17 AM

టీచర్స్ కాలనీ వాసుల ధర్నా

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ 60వ డివిజన్ వడ్డెపల్లి టీచర్స్ కాలనీ ఫేస్ -1 రోడ్డు ఆక్రమణను అరికట్టాలని టీచర్స్ కాలనీ వాసులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీచర్స్ కాలనీ ప్రతినిధులు భూపాల్ రెడ్డి, మేరుగు శివ, సురేష్, లక్ష్మణ్, సాంబయ్య మాట్లాడుతూ హనుమకొండ నేషనల్ హైవే ఫారెస్టు ఆఫీసు ఎదురుగా ఉన్న 40ఫీట్ల రోడ్డును కొందరు రియల్టర్లు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరో పించారు. రోడ్డును ఆక్రమించుకొని కట్టురాయితో పాటు ఇసుకను రోడ్డుపై పోశారని అన్నారు.

వడ్డెపల్లి, టీచర్స్ కాలనీ ఫేస్-1తో పాటు వెంకటేశ్వర కాలనీ, ఎస్బీహెచ్ కాలనీతో పాటు వివిధ కళాశాలలకు వెళ్లే విద్యార్థులు రోడ్డు ఆక్రమణ వల్ల అవస్థలు పడుతున్నారని ఆందో ళన వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం 40 ఫీట్ల రోడ్డును ఆక్రమించేందుకు గత కొన్ని నెలల నుంచి ప్రయత్నిస్తున్నా రని పేర్కొన్నారు. ఈ ఆక్రమణ విషయమై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్లను కలిసి విన్నవించి  వినతి పత్రాలు సమర్పించినట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఆక్రమణదారుడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీచర్స్ కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు. ధర్నాలో రాజేందర్రెడ్డి, శ్రీనివాస్, సురేందర్రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.