28 February, 2026 | 11:23 PM

వేట్లపాలెంలో భారీ పేలుడు.. సీఎం ఆరా

28-02-2026 03:49 PM

అమరావతి: కాకినాడ జిల్లా(Kakinada Fire Accident) సామర్లకోట మండలం(Samalkota Mandal) వేట్లపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu) తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. బాధితులకు అవసరమైన తక్షణ సాయం అందించాలని ఆదేశించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీబీఎన్ హామీ ఇచ్చారు.

ఈ ప్రమాదం జరిగినప్పుడు 20 మంది ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే హోంమంత్రి అనిత(Home Minister Anitha) తక్షణమే ఘటనాస్థలికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. బాణసంచా తయారీ కేంద్రంలో భారీగా మంటలు  ఎగిసిపడుతున్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 18 మంది చనిపోయినట్లు వార్తలొస్తున్నాయి. ఐదుగురికి తీవ్రగాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే మృతదేహాలు సమీప పొలాల్లోకి ఎగిరిపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.