ఆమనగల్లులో త్వరలోనే ఎస్టీఓ కార్యాలయం ఏర్పాటు
ఎమ్మెల్యే కసిరెడ్డి హామీ
ఆమనగల్, ఏప్రిల్ 5(విజయక్రాంతి): ఆమనగల్ కేంద్రంలో సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ పలువురు విశ్రాంత ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఆదివారం ఎమ్మెల్యే నివాసంలో పలువురు విశ్రాంత, ఉద్యోగులు ఆయన ను కలసి తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ అవసరాల దృష్ట్యా ఆమనగల్లో ఎస్టీఓ కార్యాలయం లేకపోవడం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ.. ఉద్యోగుల ఇబ్బందులను తాను అర్థం చేసుకున్నానని, త్వరలోనే ఇక్కడ ఎస్టీఓ కార్యాలయం ఏర్పాటు చేసేలా తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రక్రియను వేగవంతం చేస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం, నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
అనారోగ్య కారణాలతో వైద్యం చేయించుకున్న పేదలకు ఈ నిధి ఎంతో అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయ గోపాల్ జీ, బాలారాజు, కుమార్, పురుషోత్తం రెడ్డి, శ్రీధర్రెడ్డి, అశోక్ రెడ్డి, అమరావతి, జయరాణి, విద్యాధర్, శేఖర్, ఆంజనేయులు ఉద్యోగులు, వివిధ సంఘాల నేతలు, ప్రజా ప్రతినిధులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.




