తాగునీటి ఎద్దడికి ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలి
కామారెడ్డి, జూలై 1 (విజయక్రాంతి): జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
సింగూర్ జలాశయంలో ప్రస్తుతం సుమారు 4.5 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, ఈ నిల్వలతో రానున్న 90 రోజుల పాటు తాగునీటి అవసరాలను తీర్చే అవకాశం ఉందని తెలిపారు. సింగూర్ నుంచి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిన పక్షంలో స్థానికంగా అందుబాటులో ఉన్న తాగునీటి వనరులను వెంటనే గుర్తించాలని ఆదేశించారు. గ్రామాల్లో ఫామ్పాండ్లు, సోక్పిట్లు, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు (వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు) వంటి నీటి వనరుల అభివృద్ధి పనులను గుర్తించి, వాటి అమలుకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తదుపరి సమీక్ష సమావేశానికి సిద్ధం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.






