2 July, 2026 | 2:57 AM

కడుపు మాడ్చుకొని.. కార్పొరేట్ ఫీజులు కడుతూ..

02-07-2026 01:51 AM
  1. కళాశాలలను మించుతున్న ప్రైమరీ స్కూల్ ఖర్చులు
  2. 25% ఉచిత సీట్ల నిబంధనపై అధికారుల మౌనం

చేవెళ్ళ, జూన్ 30 (విజయక్రాంతి): పిల్లలను ప్రైమరీ స్కూల్లో చదివించాలంటే తల్లిదండ్రులకు తాహతకు మించిన భారమవుతోంది. ఏటా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తు న్న ప్రైవేట్ విద్యాసంస్థలు కాలేజీల కంటే ఎ క్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఫీజుల నియంత్రణపై 2017లో తిరుపతిరావు కమిటీ, 2025లో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ, రాష్ట్రంలో ఇప్పటికీ ఎలాంటి చట్టం అమలు కాకపోవడం గమనార్హం.

ఫీజుల పీడన.. అప్పుల పాలు

డొనేషన్లు, పుస్తకాలు, యూనిఫారాలు, ట్రాన్స్పోర్ట్, అదనపు యాక్టివిటీస్ పేరిట ప్రై వేట్ స్కూళ్లు తల్లిదండ్రులను పీడిస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు కోసం పేద, మధ్యతరగతి ప్రజలు కడుపు మాడ్చుకొని, అప్పులపాలవు తూ అనారోగ్యం మరియు ఆత్మహత్యల బా రిన పడుతున్నారు. 

పుస్తకాల దందా.. విద్యాహక్కు చట్టానికి తూట్లు

విద్యాహక్కు చట్టం ప్రకారం పేదలకు కేటాయించాల్సిన 25 శాతం ఉచిత విద్య ఎక్కడా అమలు కావడం లేదు. కొన్ని స్కూళ్లు అనుమతి లేకుండానే సీబీఎస్‌ఈ పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. దుకాణదారులతో కుమ్మక్కై 50-50 వాటాలతో పుస్తకాలు, బూట్ల దందా సాగిస్తున్నాయి.

గతంలో పట్టుబడ్డ పుస్తకాలు ఏమయ్యాయి?

గత ఏడాది చేవెళ్ళలోని వివేకానంద ఇంటర్నేషనల్, తెలంగాణ శ్రీ చైతన్య టెక్నో వంటి స్కూళ్లలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పుస్తకాలు, బట్టలను అధికారులు పట్టుకున్నారు. కానీ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇప్పటికీ ప్రజలకు చెప్పలేదు. ఈ దోపిడీపై అటు అధికారులు, ఇటు విద్యార్థి సంఘాలు నోరు మెదపడం లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీజులను నియంత్రించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.