calender_icon.png 13 February, 2026 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలనా పగ్గాల కేటాయింపు

13-02-2026 12:00:00 AM

జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు అధికారులు 

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో వెక్కిరిస్తున్న ఖాళీలు

ఒక్కో అధికారికి రెండు, మూడు బాధ్యతలు

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగర పాలనలో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. కోర్ అర్బన్ రీజియన్‌ను పునర్‌వ్యవవస్థీకరిస్తూ జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్ గిరి విభజించిన ప్రభు త్వం, బుధవారం రాత్రి ఆయా కార్పొరేషన్లకు కీలక అధికారులను నియమిస్తూ జీవో  జారీ చే సింది. అయితే ఇతర సిబ్బందిని కొత్త కార్పొరేషన్లకు కేటాయించడంతో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వెలవెలబోతోంది. విభాగాలలోని చాంబర్లు ఖాళీగా దర్శనమిస్తుండగా, ఉన్న కొద్దిమంది అధికారులపైనే అదనపు బాధ్యతల మోత పడుతోంది.

జీహెచ్‌ఎంసీ శానిటేషన్ అదనపు కమిషనర్‌గా సికింద్రబాద్ జోనల్ కమిషనర్ ఎన్ రవికిరణ్‌ను నియమించారు. అడ్మిన్ అదనపు కమిషనర్‌గా కె సత్యనారాయణ, చీఫ్ సిటీ ప్లా నర్గా కె. శ్రీనివాస్, చీఫ్ ఇంజనీర్గా ఎస్. రత్నాకర్ బాధ్యతలు చేపట్టనున్నారు. మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్‌కు అదనపు కమిషనర్లుగా సిఎన్ రఘుప్రసాద్ శానిటేషన్, కె వేణుగోపాల్ అడ్మిన్, చీఫ్ సిటీ ప్లానర్‌గా కె. ప్రదీప్ కుమార్, చీఫ్ ఇంజనీర్‌గా వి. అశోక్‌రెడ్డి నియమితులయ్యారు.

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు డాక్టర్ ఎన్. యాదగిరిరావు శానిటేషన్, బి గీతా రాధిక అడ్మిన్ అదనపు కమిషనర్లుగా, బి. వెంకన్న చీఫ్ సిటీ ప్లానర్‌గా, ఎస్ నిత్యానందం చీఫ్ ఇంజనీర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఎస్‌ఈ పీహెచ్‌గా ఉన్న ఎస్ భాస్కర్‌రెడ్డికి ఈఎన్సీ పీహెచ్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

అధికారులపై అదనపు భారం

ప్రభుత్వ నిర్ణయంతో స్పెషల్ ఆఫీసర్లు బాధ్యతలు చేపట్టినప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు చేసేందుకు సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. జీహెచ్‌ఎంసీలో ఖాళీ అయిన అదనపు కమిషనర్ పోస్టుల భారాన్ని జోనల్ కమిషనర్లకు అప్పగించడంతో వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఫైనాన్స్, రెవెన్యూ, ఐటీ విభాగాల అదనపు కమిషనర్ అనురాగ్ జయంతికి రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ బాధ్యతలు కూడా ఉన్నాయి. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రియాంక ఆలకు హెల్త్ విభాగం అదనపు కమిషనర్గా, రవికిరణ్‌కు శానిటేషన్ అదనపు బాధ్యతలు అప్పగించారు.

గోల్కొండ జోనల్ కమిషనర్ ముకుంద రెడ్డికి ఎలక్షన్ వింగ్ బాధ్యతలు ఇవ్వగా, ఆయన అందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. యూసీడీ అదనపు కమిషనర్ పంకజ బదిలీ కావడంతో ఆ బాధ్యతలు మంగతాయారుకు, యూబీడీ డైరెక్టర్ వెంకటేశ్వరరావుకు అదనపు కమిషనర్ యూబీడీ బాధ్యతలు కేటాయించారు. ఒకే అధికారికి రెండు మూడు శాఖలు ఉండటంతో వారు ఎప్పుడు ఎక్కడ అందుబాటులో ఉంటారో తెలియక ప్రజలు, కింది స్థాయి సిబ్బంది అయోమయానికి గురవుతున్నారు.

రెవెన్యూలో కలిసిన ఎస్టేట్ విభాగం

సిబ్బంది కొరతను అధిగమించేందుకు కమిషనర్ కర్ణన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ ఆస్తుల పరిరక్షణ, అద్దె వసూళ్లు చూసే ఎస్టేట్ విభాగాన్ని రెవె న్యూ వింగ్‌లో విలీనం చేశారు. గతంలో ఎస్టేట్ అధికారులు చూసే ఆక్షన్ బాధ్యతలు ఇప్పటికే సర్కిల్ డిప్యూటీ కమిష నర్లకు బదిలీ అయ్యాయి. ఈ నేపథ్యంలో, ఎస్టేట్ సిబ్బంది నిర్వహించే అద్దె వసూళ్ల బాధ్యతలను ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసే టాక్స్ ఇన్‌స్పెక్టర్లకు అప్పగించి, ఎస్టేట్ సిబ్బందిని ఇతర అత్యవసర విధులకు మళ్లించాలని కమిషనర్ భావిస్తున్నట్టు సమచారం.