రాజు గోండుల కోటను దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి: కలెక్టర్ రాజర్షిషా
ఉట్నూర్,(విజయక్రాంతి): పర్యాటకులను ఆకర్షించేలా గోండు రాజుల కోట పునరుద్ధరణ పనులు చేపట్టాలని కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. శుక్రవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని చారిత్రక రాజు గోండుల కోటను సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి మంద మకరందుతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి కలెక్టర్, పిఓ కోట పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు.
అనంతరం ఐటిడిఏ పిఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... గోండు రాజుల చరిత్రకు, గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచిన రాజు గోండుల కోటను త్వరితగతిన పునర్నిర్మించాలని ఆదేశించారు. ఆధునిక సౌకర్యాలతో దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేలా దీనిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సంబంధిత శాఖల అధికారులను కోరారు. కోట పునర్నిర్మాణ పనుల్లో ఎక్కడా చారిత్రకతకు భంగం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు. భావితరాలకు గిరిజనుల గొప్ప చరిత్రను తెలియజేసే విధంగా కోటలో ఒక అత్యాధునిక మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ మ్యూజియంలో గోండు రాజుల వంశ చరిత్ర, వారి పాలన, సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ ఆనవాళ్లు, పురాతన వస్తువులు, చారిత్రక ఆధారాలను ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా కోట ప్రాంగణంలో గిరిజన సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక వేదిక, గిరిజన హస్తకళలు, సంప్రదాయ ఉత్పత్తుల విక్రయానికి మార్కెటింగ్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటితో పాటు చిన్నారుల కోసం ప్రత్యేక పార్కు, క్రీడా ప్రాంగణం, సందర్శకుల కోసం రూఫింగ్ షెడ్లు, విశ్రాంతి భవనాలు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు, ఆకర్షణీయమైన ఉద్యానవనాలు, విద్యుద్దీపాల అలంకరణ, పచ్చదనం పెంపు వంటి అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని పేర్కొన్నారు.
సందర్శకులు కోట చరిత్రను సులభంగా తెలుసుకునే విధంగా సమాచార ఫలకాలు, దిశానిర్దేశక బోర్డులు, డిజిటల్ సమాచార వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కోట అభివృద్ధి ద్వారా స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఉట్నూర్ ప్రాంతం పర్యాటక రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటిడిఏ పిఓ మాట్లాడుతూ, రాజు గోండుల కోటను సుందరీకరించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.






