చొప్పదండి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐపై ఆరోపణలు
చొప్పదండి,(విజయక్రాంతి): చొప్పదండి మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్‌ఐ రహీమ్‌పై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వస్తున్న పిటిషన్ దారులను ఆయన తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. సరైన పత్రాలు లేవని కారణం చూపుతూ దరఖాస్తులను తిరస్కరించడం వల్ల ప్రజలు కార్యాలయం చుట్టూ పలుమార్లు తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల సమస్యలను దశలవారీగా పరిశీలించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ, ప్రాథమిక స్థాయిలోనే దరఖాస్తులు నిలిచిపోతున్నాయని పలువురు చెబుతున్నారు. ముఖ్యంగా ఆదాయ, భూమి సంబంధిత ధ్రువపత్రాల కోసం వచ్చినవారికి సరైన మార్గదర్శకాలు ఇవ్వకుండా పంపిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చినవారు సమయం, డబ్బు వృథా చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది.
ఇప్పటికే ఈ వ్యవహారంపై తహసీల్దార్‌కు పలుమార్లు ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధితులు తక్షణమే సమస్యపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, కార్యాలయ పనితీరును మెరుగుపరిచే చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.






