‘సర్’కు అన్ని పార్టీలు సహకరించాలి
ఆర్డీవో వెంకట్ రెడ్డి
మేడ్చల్, జూలై 29 (విజయ క్రాంతి): ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో ఇంటింటి సర్వే పూర్తి చేసేందుకు ఇంకా ఐదు రోజులే గడువు ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించి అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా చూడాలని కీసర ఆర్డీఓ, ఎన్నికల నమోదు అధికారి నల్ల వెంకట్ రెడ్డి కోరారు.మేడ్చల్ నియోజకవర్గంలో ఓటరు వివరాల డిజిటైజేషన్ ఇప్పటికే 81.92 శాతం పూర్తుందని తెలిపారు.
బుధవారం కీసర రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం జూలై 15న సవరించిన ఎస్‌ఐఆర్ షెడ్యూల్ను వివరించిన ఆయన, బీఎల్‌ఓల ఇంటింటి సర్వే ఆగస్టు 3 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఆగస్టు 10న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించి, అదే రోజు నుంచి సెప్టెంబర్ 9 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు.
అనంతరం అభ్యంతరాల పరిశీలన పూర్తిచేసి అక్టోబర్ 12న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని వెల్లడించారు. నిర్ణీత గడువులోగా 100% పూర్తి చేయడానికి రాజకీయ పార్టీలు, బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు), బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు) సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, పేర్లు, చిరునామా మార్పులు, మరణించిన వారు లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్లిన ఓటర్ల పేర్ల తొలగింపు వంటి ప్రక్రియలను ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చేపడుతున్నట్లు వివరించారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని పలు సూచనలు, అభిప్రాయాలను వెల్లడించారు.






