12 June, 2026 | 2:18 AM

విద్యార్థుల జీవితాలతో చెలగాటం

12-06-2026 01:15 AM

నీట్ పేపర్ లీక్‌తో విద్యావ్యవస్థపై నమ్మకం పోయింది..

విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు..

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫైర్

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్

న్యూఢిల్లీ, జూన్ ౧౧: విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతున్నదని ఏఐ సీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) లీక్ కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని వాపోయారు.

వారికి విద్యావ్యవస్థపై నమ్మ కం కోల్పోయేలా కేంద్ర విద్యాశాఖ వ్యవహారం ఉందని ఆక్షేపించారు. పేపర్ లీక్‌కు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలోని ఇందిరా భవన్‌లో గురువారం నిర్వహించిన ఏఐసీసీ అత్యవసర సమావేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

నీట్ తో పాటు అనేక పేపర్ లీక్‌లు యువత మనసులను తీవ్రంగా గాయపరిచాయని వెల్లడించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ స్వయంగా నీట్ విద్యార్థులతో మాట్లాడరని, వారు అనుభవిస్తున్న క్షోభను తెలుసుకుని ఓదార్చారని గుర్తుచేశారు. దేశాన్ని ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ప్రశ్నాపత్రాల లీక్‌లు, సీబీఎస్‌ఈ మూల్యాంకన లోపాలు, సామాజిక అసమానతల వంటి సమస్యలు పట్టి పీడిస్తున్నాయని, కేంద్రం వాటిని పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ తన దశాబ్దాల పాలనలో నిర్మించిన విద్యాసంస్థలు, వ్యవస్థలు బీజేపీ అధికారంలోకి వచ్చాక బలహీన పడ్డాయని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని కాపాడటమే ప్రస్తుతం కాంగ్రెస్ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. ఓట్ చోరీ, సర్ అంశాలపై ఇండియా కూటమి సీజేఐకి లేఖ రాయాలని నిర్ణయించామని, ఆ లేఖను స్వయంగా సీజేఐని కలిసి అందజేస్తామని వెల్లడించారు. సమావేశంలో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీనియర్ నేత జైరాం రమేష్, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. తెలం గాణ పీసీసీ మహేశ్‌కుమార్ గౌడ్, అసోం పీసీసీ చీఫ్ గౌరవ్ గొగోయ్ తదితరులు పాల్గొన్నారు.