పక్క రాష్ట్రాల్లో మనోళ్ల ప్రచారం
- కేరళంలో రెండు రోజుల పాటు..
- సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం
- పుదుచ్చేరికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం
- అస్సాంకు వెళ్లిన మంత్రి సీతక్క
- ఆదివాసీ, గిరిజనుల నియోజక వర్గాల్లో ..
- సీతక్కకు ప్రచారం బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ
- హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ నేతలు పక్క రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార జోరు పెంచారు. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం శ్రమిస్తున్నారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుం డగా తెలంగాణ కాంగ్రెస్ నేతలను మూడు రాష్ట్రాల్లో స్టార్ట్ క్యాంపెయినర్లుగా పార్టీ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే.
అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు రోజుల పాటు కేరళంలో యూడీ ఎఫ్ అభ్యర్థుల విజయం కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒక వైపు కార్నర్ మీటింగ్‌లు, మరో వైపు రోడ్ షోలు చేపట్టారు. తివేండ్రం, అలప్పుజ, ఎర్నాకులంలో పార్టీ అభ్యర్థుల విజయం కోసం బుధ, గురువారాల్లో జోరుగా ప్రచారం నిర్వహించగా, ఆ రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోను కూడా సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ప్రధానంగా కేరళంలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్, బీజేపీ పైన విరుచుకుపడ్డారు.
సీఎం రేవంత్‌రెడ్డి కేరళంకు వెళ్లడానికి ముందే రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెళ్లారు. రాహుల్‌గాంధీ హాజరైన బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పొంగులేటి చూసుకున్నారు. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కేరళంలోనే పూర్తిగా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. దేవికులం నియోజక వర్గంలో పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రచా రం నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కేరళం, పాండిచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి బుధవారం రాత్రే వెళ్లారు. శనివారం వరకు అక్కడనే ఉండనున్నారు.
గురువారం పుదుచ్చేరిలో పార్టీ నేతలతో సమావేశమైన భట్టి విక్రమార్క స్థానికంగా ఎన్నికల ప్రచా రం, సభల నిర్వహణతో పాటు ఎన్నికల వ్యూహాంపైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించారు. మంత్రి సీతక్క అస్సాం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి గురువారం వెళ్లారు. రెండు రోజుల పాటు అస్సాంలోని డిబ్రునగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. డిబ్రునగర్ జిల్లాలో ఎక్కువగా ఆదివాసీ, గిరిజన ప్రజలు ఎక్కువగా ఉండటంతో.. మంత్రి సీతక్కను పార్టీ అధిష్టానం రాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పంపింది.




