అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు సెప్టెంబర్ 9 చివరి గడువు
నల్లగొండ టౌన్, ఆగస్టు 23: విద్యను ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధునిక అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులు, విధానాలను అమలు చేస్తోందని ఎడ్యుకేషన్ ఎక్స్టెన్షన్ సెంటర్ నోడల్ అధికారి డాక్టర్ బి. ధర్మ నాయక్ తెలిపారు. ఆదివారం నల్గొండ పట్టణ రీజినల్ కేంద్రంలో అధ్యయన కేంద్రాల కౌన్సిలర్ల సమావేశం నిర్వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2026 విద్యా సంవత్సరానికి యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయని, అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 9 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.రెగ్యులర్ విద్యను కొనసాగించలేని వారికి ఓపెన్ యూనివర్సిటీ ఎంతో అనుకూలమని, ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో తమకు అనుకూలమైన సమయంలో చదువుకునే అవకాశం ఉంటుందన్నారు.
యూనివర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అనుగుణంగా నూతన కోర్సులు రూపొందిస్తున్నట్లు తెలిపారు. సాంకేతికతను వినియోగించి గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.టెలికాన్ఫరెన్స్ ద్వారా రిజిస్ట్రార్ ఎల్.వి.కె. రెడ్డి మాట్లాడుతూ చదువుతోపాటు ఉద్యోగ అవకాశాల కల్పనకు టీసీఎస్, రాశి, వి-హబ్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లా నుంచి ప్రతి ఏటా అత్యధిక అడ్మిషన్లు ఉంటాయని, ఈ ఏడాది కూడా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని సూచించారు.ఈ సమావేశంలో రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ అనిల్ బొజ్జ, మహిళా డిగ్రీ కళాశాల కో-ఆర్డినేటర్ రాజారామ్, కౌన్సిలర్లు శ్రీకాంత్, మహేష్ పాల్గొన్నారు.






