భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే గురుతర బాధ్యత గురువులదే..
విద్యా విజయోత్సవంలో అదనపు కలెక్టర్ నగేష్ వెల్లడి
మెదక్, మే 17 (విజయక్రాంతి): చక్కటి విద్యా బుద్ధులు నేర్పించి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు సమర్ధవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేష్ హితవు పలికారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యా వారోత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆదివారం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మెదక్ నందు జరిగిన కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ నగేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్ధి దశ ఎంతో కీలకమని అన్నారు. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, కలలను సాకారం చేసుకునే దిశగా నిజాయితీతో ముందుకు వెళ్లాలని మార్గనిర్దేశం చేశారు.
భవిష్యత్తులో స్థిరపడేందుకు పదవ తరగతి తరువాత ఎంచుకునే మార్గం ఎంతో కీలకం అయినందున, మీకు ఇష్టమైన సబ్జెక్టులతో కూడిన కోర్సులలో చేరాలని, ఈ విషయంలో ఎవరు ఏం అనుకుంటారో అనే సంశయాలు, మొహమాటానికి లోను కాకూడదని విద్యార్థులకు సూచించారు. ఎంచుకున్న గమ్యాన్ని ఎలా చేరుకోవాలి అనే దానిపై స్పష్టత కలిగి ఉండాలని, ఆ దిశగా అంకిత భావంతో కృషి చేస్తే తప్పకుండా లక్ష్యాన్ని చేరుకోగల్గుతారని అన్నారు. అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా నిరంతర కృషి, పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
బలహీనతలను అధిగమిస్తూ, స్పష్టమైన ప్రణాళికతో కృషి చేస్తే తప్పక విజయం వరిస్తుందని విద్యార్థులకు మార్గోపదేశం చేశారు. ఉపాధ్యాయులు అంటే తనకు ఎంతో గౌరవం అని వెల్లడించిన అదనపు కలెక్టర్, ప్రతిమా విద్యార్థులు భవిష్యత్తుకు నష్టం వాటిల్లకుండా తమ గురుతర బాధ్యతకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు , ఏఎంఓ సుదర్శన్ మూర్తి సీఎంఓ రాజు, ఏ ఎస్ ఓ నవీన్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, జిల్లా విద్యాశాఖ పాల్గొన్నారు.






