18 May, 2026 | 3:03 AM

పల్లె రోడ్లు బాగుపడేనా?

18-05-2026 02:08 AM
  1. నిధులు మంజూరైనా.. ప్రారంభం కానీ పనులు..
  2. మూడేళ్లుగా మొలుగుతున్న నిధులు..
  3. వర్షాకాలంలో బయట ప్రపంచానికి నాలుగు నెలలు దూరం కానున్న గిరిజనులు

ఉట్నూర్, మే 17 ( విజయ క్రాంతి ): దేశానికి స్వతంత్రం వచ్చి నాలుగు దిశబ్దాలు దాటిన నేటికీ గిరిజనులకు రహదారి కష్టాలు తీరడం లేదు. వర్షాకాలం వచ్చిందంటే చా లు గిరిజనులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బయట ప్రపంచానికి నాలుగు నెలల పాటు దూరంగా ఉండవలసిన పరిస్థితి నేటికీ గిరిజన గ్రామాల్లో నెలకొంది. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించుటకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన నేటికీ పనులు పూర్తి ప్రారంభం కావడం లేదు..

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించుటకు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంతోపాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన నేటికీ పనులు ప్రారంభం కాకపోవడంతో గిరిజనులు పడుతున్న కష్టాలు వర్ణాతితం. ప్రతి ఏటా వర్షాకాలం వచ్చిందంటే గిరిజనులు ప్రాణాలనుఅరుచేతుల్లో పెట్టుకొని వాగులు దాటి బయట ప్రపంచానికి చేరుకోవాల్సిన పరిస్థితి నేటికి నెలకొంది. ఉట్నూర్ ఏజెన్సీలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, ఆదిలాబాద్ రూరల్, సిరికొండ తదితర మండలాల్లోని మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు వాగులు దాటి బయట ప్రపంచానికి రావలసిన పరిస్థితి నేటికీ ఉంది.

గిరిజనులు పడుతున్న కష్టాలను తీర్చుటకు ప్రభుత్వాలు మంజూరు చేసిన నిధులు గత మూడు నాలుగు ఏళ్లుగా మూలుగుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం కోట్లాది రూపాయలు మంజూరు చేసిన వంతెన నిర్మాణం తో పాటు బీటీ రోడ్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో రోడ్డులు, కల్వర్టుల నిర్మాణానికి నిధులు మంజూరైన విషయం తెలిసిన గిరిజనులు సంతోషపడ్డారే తప్ప పనులు ప్రారంభం కాకపోవడంతో గిరిజనులు నిరాశ నిస్ప్రోలకు గురవుతున్నారు.. ఇప్పటికైనా ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని వర్షాకాలం ప్రారంభంలోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని గిరిజనులు కోరుతున్నారు..

నాలుగేళ్లుగా ప్రారంభం కాని కల్వర్టు పనులు..

ఇంద్రవెల్లి మండలంలోని హర్కాపూర్ పంచాయతీ పరిధిలోకి వచ్చే వడ్గావ్ వాగు పై కల్వర్టు నిర్మాణానికి గత బారాస ప్రభుత్వం 3.50 కోట్లు మంజూరు చేసింది. మంజూరైన నిధులకు టెండర్లలో కాంట్రాక్టర్కు పనులు అప్పగించిన నేటికీ పనులు ప్రారంభించడం లేదు. అంజి పంచాయతీ పరిధిలోని మామిడిగుడా(ఏ ) నుండి మామిడిగుడా( జీ )వరకు బీటీ రోడ్ నిర్మాణానికి  90 లక్షలతో పనులు ప్రారంభించి మూడేళ్లు దాటిన నేటికీ పనులు పూర్తి కావడం లేదు.

ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలకు అడ్డంకి ఉన్న వాగులపై కల్వర్టులు నిర్మించుటకు గత బీ ఆర్‌ఎస్ ప్రభుత్వం ఐటీడీఏ పరిధిలోని గ్రామాల్లో కల్వర్టుల నిర్మాణానికి కోట్ల రూపాయలు మంజూరు చేసింది.  దీంతో వచ్చే వర్షాకాలంలో మారుమూల గిరిజన గ్రామాల్లో ప్రజలు నాలుగు నెలలపాటు బయట ప్రపంచానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది.