సమస్యలపై చర్యలు వేగవంతం చేయాలి
నాగోల్, మే 2 (విజయ క్రాంతి): ఎల్బీనగర్ నియోజకవర్గంలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి అధికారులను కోరారు. ఈ మేరకు జోనల్ కమిషనర్ వికాస్ మహతోను కలిసి నియోజకవర్గ సమస్యలను వివరించారు. ఇటీవల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు జోక్యంతో అభివృద్ధి పనులకు నిధుల మంజూరు దిశగా చర్యలు ప్రారంభమైనట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి ఇచ్చిన లేఖను కమిషనర్కు అందజేశారు. ప్రాంతంలో రహదారు లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యువనాయకులు యరమల రామచంద్ర రెడ్డి, జక్కిడి సత్యతేజ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






