ప్రపంచ జనాభా దినోత్సవం, సీజనల్ వ్యాధులపై అవగాహన ర్యాలీ
తుంగతుర్తి,(విజయక్రాంతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రావులపల్లి ఆధ్వర్యంలో "యువత ఆశలు, ఆకాంక్షలను నేడు మరియు భవిష్యత్తు కోసం సాకారం చేద్దాం" అనే నినాదంతో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ లింగమూర్తి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా పెరుగుతున్న జనాభా కారణంగా ఏర్పడుతున్న సామాజిక, ఆర్థిక, ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం, కుటుంబ నియంత్రణ, లింగ సమానత్వం మరియు మానవ హక్కుల ప్రాధాన్యతను వివరించడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
దేశంలో జనాభా నియంత్రణలో ఆరోగ్య శాఖ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొంటూ, కుటుంబ నియంత్రణ కోసం అందుబాటులో ఉన్న తాత్కాలిక పద్ధతులైన అయ్ సిడి చాయ్ మాత్రలు (Chhaya Pills), ఓరల్ కాంట్రాసెప్టివ్ మాత్రలు, ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ మాత్రలు, నిరోధ్ అంతర ఇంజెక్షన్ వంటి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులైన మహిళలకు ట్యూబెక్టమీ , పురుషులకు వాసెక్టమీ చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఈ సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
అనంతరం వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, ఫైలేరియా, జపనీస్ ఎన్‌సెఫలైటిస్ (మెదడు వాపు) వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయని వివరించారు. అదేవిధంగా కలుషితమైన నీరు, అపరిశుభ్రమైన ఆహారం, ఈగలు వాలిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల నీళ్ల విరేచనాలు, బంక విరేచనాలు, టైఫాయిడ్, కలరా, కామెర్లు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, కిటికీలకు జాలీలు అమర్చుకోవాలని, దోమతెరలు ఉపయోగించాలని, బయటి ఆహారాన్ని నివారించాలని, వేడి ఆహారం మాత్రమే తీసుకోవాలని మరియు సురక్షితమైన తాగునీటిని వినియోగించాలని సూచించారు.






