26 May, 2026 | 3:58 AM

కొనుగోలు తరలింపు వేగవంతం చేయండి

26-05-2026 12:37 AM

అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఖుష్బూ గుప్తా

మూసాపేట మే 25 : ధాన్యం కొనుగోలుతో పాటు రైస్ మిల్లులకు తరలింపు ప్రక్రియ కూడా వేగవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సంబంధిత అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని పి.పి.సి సెంటర్ జిల్లా కలెక్టర్ తనిఖీలు నిర్వహించి రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల కొనుగోలు చేసిన ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రంలో నింపి ఉన్న గన్నీ సంచులను మిల్లులకు ఎందుకు తరలించలేదని అధికారులను ప్రశ్నించారు. సరిపడా రవాణా వాహనాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఆలస్యం జరుగుతోందని  నిర్వాహకులు తెలిపారు. 

జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ రవి నాయక్, జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్లకు అదనపు లారీలను వెంటనే ఏర్పాటు చేసి ధాన్యం సంచులను తక్షణమే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే మిల్లుల వద్ద కూడా ధాన్యం సంచుల అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ట్రక్ షీట్ వివరాలను ఓపిఎంఎస్ యాప్లో ఆలస్యం చేయకుండా అప్లోడ్ చేయాలని సూచించారు. రైతులకు చెల్లింపులు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో  ఎస్.పి డి. జానకి, జిల్లా పౌర సరఫరాల సంస్థ డి.ఎం రవి నాయక్, జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్, మూసాపేట్ మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.