కొనుగోళ్లలో వేగం పెంచండి
- రెండు, మూడు రోజుల్లోనే జరగాలి
- లేదంటే వేలాది మంది రైతులతో కలెక్టరేట్‌లను ముట్టడిస్తాం
- ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరిక
సిద్దిపేట, మే 25 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, లేదంటే రైతులతో కలిసి కలెక్టరేట్‌లను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం హరీశ్‌రావు సందర్శించారు. కల్లాల్లో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
రెండు మూడు రోజుల్లో కొనుగోలు వేగవంతం చేయకపోతే తానే స్వయంగా వేలాది మంది రైతులతో కలెక్టరేట్ ముట్టడిస్తానని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది రైతులు హరిగోస పడుతున్నారన్నారు. ‘ఈ ప్రభుత్వానికి రైతులంటే పట్టింపు లేదు, లెక్కలేదు. యూరియా సరఫరా, కరెంటు, రైతుబంధు ఇవ్వడంలో ఫెయిల్ అయిన ప్రభుత్వం, ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను కొనడంలో కూడా పూర్తిగా విఫలమైంది. రాష్ర్టంలో కోటి 40 లక్షల టన్నుల దిగుబడి వస్తుంటే.
. నిన్నటి దాకా 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఇవాళ 70 లక్షల టన్నులే కొంటామంటున్నారు. మిగతా 70 లక్షల టన్నులు రైతులు దళారులకు అమ్ముకుని నష్టపోవాలా, వడ్లు కొనడం చేతగాక కేంద్రం మీద నెపం నెడుతున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని మిల్లుల్లో బస్తాకు 43 కిలోలు పెడితేనే దించుకుంటామని మిల్లర్లు రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. దీనివల్ల ఎకరాకు 150 కిలోల చొప్పున రైతులు నష్టపోతున్నారు.
ఈ విషయాన్ని డీఎస్‌ఓ దృష్టికి తీసుకెళ్తే మీరు మిల్లర్లతోనే మాట్లాడుకోండి అని బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇస్తున్నారు’ అని విమర్శించారు. వెంటనే మక్కలు, పొద్దుతిరుగుడు, జొన్నలు అమ్మిన రైతులకు డబ్బులు ఖాతాల్లో జమ చేయాలని, రెండు, మూడు రోజుల్లో వడ్ల కొనుగోళ్లలో వేగం పెంచి, తరుగు లేకుండా కొనాలని డిమాండ్ చేశారు. లారీలు, గన్నీ బ్యాగులు పంపకపోతే స్వయంగా వేలాది మంది రైతులతో కలెక్టరేట్‌లను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హరీశ్‌రావు హెచ్చరించారు.






