మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దించుకోవాలి
జిల్లా కలెక్టర్ కె. హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 25( విజయ క్రాంతి):రైస్ మిల్లర్లు యాసంగి వరి ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హరిత సూచించారు.సోమవారం కలెక్టరేట్ లోని పాలనాధికారి చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి రైస్ మిల్లర్లు, వాహనాల కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి మద్దతు ధర చెల్లించి నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన రైస్ మిల్లులకు పంపిస్తున్నామని తెలిపారు. మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకుని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగవంతంగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
ధాన్యం దిగుమతిలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.హమాలీల కొరత తలెత్తకుండా స్థానికంగా అందుబాటులో ఉన్న హమాలీలను వినియోగించుకోవాలని, ధాన్యం తరలింపులో వాహనాల కొరత లేకుండా సంబంధిత కాంట్రాక్టర్లు తగిన సంఖ్యలో వాహనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. అవసరమైతే స్థానిక వాహనాలను కూడా వినియోగించుకోవాలని తెలిపారు.
కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని, గోనె సంచుల కొరత లేకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.






