17 May, 2026 | 1:17 AM

మక్క కొనుగోళ్లలో వేగం పెంచండి

17-05-2026 12:09 AM

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు 

హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి) : మక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆదేశించారు.శుక్రవారం సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మక్కజొన్న కొనుగోళ్లు, నిల్వ సౌక ర్యం, గన్నీ బ్యాగుల లభ్యత, రవాణా ఏర్పాట్లపై చర్చించారు. ఈ సదర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 9.57 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు సేకరించినట్లు తెలిపారు.

కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులు రూ.4 వేల కోట్ల వెచ్చించి మక్కజొన్న కొనుగోలు చేపట్టిందన్నారు. అదే విధంగా జొన్నలను కూడా సేకరించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి వెల్లడించారు.సేకరించిన మక్కజొన్నలను నిల్వ చేయడానికి 15.07 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు అవసరమని, ప్రస్తుతం రాష్ట్రంలో 11.40 లక్షల మెట్రిక్ టన్నులకే నిల్వ సామర్థ్యం ఉందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే 3 కోట్ల గన్నీ బ్యాగులకు గాను 2 కోట్ల బ్యాగులు సరఫరా చేశామని, మిగిలిన కోటి బ్యాగులను వెంటనే అందుబాటులోకి తేవాలన్నారు. 

హమాలీల కొరత లేకుండా చూడాలని, కాంటా వేసిన పంటను ఎప్పటికప్పుడు గోదాములకు తరలించేందుకు అవసరం మేరకు లారీలను అందుబాటులో ఉంచాలన్నారు. శనగ, పొద్దుతిరుగుడు పంటల కొనుగోలుపై 25 శాతం సీలింగ్‌ను  50 శాతానికి పెంచాలని కేంద్రానికి మరోసారి లేఖ రాయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని, మొక్కజొన్న, జొన్నలను పీఎస్‌ఎస్‌లో చేర్చేలా కృషి చేయాలని కోరారు.