పంట అవశేషాలను కాల్చొద్దు
- భూసారం దెబ్బతిని దిగుబడి తగ్గుతుంది
- వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): పంట అవశేషాలను కాల్చొద్దని, దీని వల్ల భూసారం దెబ్బతిని దిగుబడి తగ్గడంతో పాటు పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బీ గోపి రైతులకు సూచించారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించాలని క్షేత్రస్థాయి అధికారులకు శనివారం ఆయన ఆదేశాలు జారీ చేశారు.
పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ కర్బనం, నత్రజని, భాస్వరం, పొటాష్‌తో పాటు సూక్ష్మపోషకాలు నశించి భూమి నిస్సారంగా మారుతుందన్నారు. అంతేకాకుండా భూమికి మేలు చేసే వానపాములు, మిత్ర పురుగులు నశించడం వల్ల నేల జీవసత్తువ కోల్పోయి, దిగుబడులు క్రమంగా తగ్గి పోతాయన్నారు.
పంట వ్యర్థాల దహనం వల్ల విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ వంటి వాయువులు గాలి కాలుష్యాన్ని పెంచి ఆస్తమా, శ్వాసకోశ సమస్యలకు దారితీస్తాయని, ముఖ్యంగా గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. రోడ్లపై పొగమంచు ఏర్పడి ప్రమా దాలు సంభవించే అవకాశముందని హెచ్చరించారు. పంట అవశేషాలను భూమిలోనే కలియదున్నాలన్నారు. రైతులు సంప్రదాయ పంటలకు బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.






