6 June, 2026 | 2:46 AM

మన జల హక్కులకు ముప్పు

06-06-2026 01:30 AM
  1. కృష్ణా జలాల వినియోగంలో కనిష్ట స్థాయికి
  2. లిఫ్టుల నిర్వహణపైనా అలసత్వం
  3. ‘రైతు డిస్కం’ను విరమించుకోవాలి
  4. సీఎం రేవంత్‌రెడ్డికి  హరీశ్‌రావు లేఖ

హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల తెలంగాణ జల హక్కులకు ముప్పు వాటిల్లిందని మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణ పట్ల ప్రభుత్వం తీవ్ర అలసత్వం వహిస్తోందన్నారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని గాయంత్రి పంపింగ్ స్టేషన్‌తో పాటు దేవాదుల, ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో మోటార్లు, పంపులు దెబ్బతిన్నాయన్నారు.

మోటర్లను పదేపదే ఆన్ చేయడం వల్ల పరికరాలు పాడవుతాయని బీఆర్‌ఎస్ హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రాజె క్టులను బలహీనపరచి ఆ నెపాన్ని బీఆర్‌ఎస్‌పై మోపే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. సోలార్  ఆధారిత విద్యుత్  వినియోగం వల్ల పగటి వేళల్లోనే ఎత్తిపోతల పథకాల పంపులు నడపాల్సి వస్తుదని, దీని వల్ల కృష్ణా-, గోదావరి జలాలను వినియోగ సామర్థ్యం దెబ్బతింటుందని వెల్లడించారు.

అంతేకాకుండా పంపులను తరచూ ఆఫ్, ఆన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీంతో వాటికి నష్టం జరిగే ప్రమాదం ఉటుందన్నారు.  కృష్ణా జలాల వినియోగంలో తెలం గాణ చారిత్రక కనిష్టస్థాయికి పడిపోయిందని హరీశ్‌రావు ఆరోపించారు. 2024--25లో ఆంధ్రప్రదేశ్ 72.73 శాతం నీటిని వినియోగించగా, తెలంగాణ కేవలం 27.27 శాతం మాత్రమే వాడుకుందన్నారు. 2025--26లో ఆంధ్రప్రదేశ్  74.90 శాతం నీటిని వినియోగించుకుంటే, తెలంగాణ వాటా కేవలం 25.10 శాతానికి పరిమితమైందని వివరించారు.

నీటి లభ్యత అధికంగా ఉన్నప్పటికీ తెలంగాణ తన వాటా వినియోగించుకోవడంలో విఫలమైందన్నారు. రైతు డిస్కం ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని, కాళేశ్వరం, దేవాదుల తదితర ప్రాజెక్టుల నిర్వహణ, ఆధునీకరణకు బడ్జెట్  కేటాయించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం, తాగు నీరు, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి తదితర రంగాలకు తగిన నీటి లభ్యతను నిర్ధారించాలని హరీశ్‌రావు కోరారు.