29 July, 2026 | 9:54 PM

Breaking News

బురదలో చిక్కుకున్న ఆర్టిసి బస్సు   •   ఓటు హక్కు అమూల్యం.. దరఖాస్తులో జాప్యం వద్దు   •   భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క సేవ యాత్ర   •   శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి   •   బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ   •   విశ్వబ్రాహ్మణ సంఘం గుండి గ్రామ కమిటీ ఏర్పాటు   •   సిఐ నీలం రవికి ఘన సన్మానం   •   మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •  

30 వేల కోట్ల భూమికి రక్ష

06-06-2026 01:37 AM

కబ్జాకోరల నుంచి కాపాడిన హైడ్రా

పుప్పాలగూడలో 200 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్

250 కోట్ల ఏళ్ల నాటి చారిత్రక రాళ్ల గుట్టలకు విముక్తి

రాజేంద్రనగర్, జూన్ 5 (విజయక్రాంతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ హైడ్రా నగర చరిత్రలోనే అత్యంత భారీ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. దశా బ్దాలుగా కబ్జాదారుల కన్నుపడి, వివాదాల్లో నలుగుతున్న దాదాపు 30 వేల కోట్ల రూపాయల విలువైన 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది.

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ ఖాజాగూడ సరిహద్దుల్లోని అత్యంత విలువైన ఈ భూమికి శుక్రవారం హైడ్రా అధికారులు పటిష్టమైన ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకున్నారు. కోట్లాది రూపాయల భూమితో పాటు దాదాపు 250 కోట్ల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సహజ సిద్ధమైన రాతి గుట్టలు, అతి పురాతన రాతి గుహలు, పర్యావరణ సంపదను కాపాడటం ద్వారా హైడ్రా ప్రకృతికి నిజమైన నీరాజనం పలికింది.

హైకోర్టు తీర్పుతో మార్గం సుగమం

ఖజానా కంటే విలువైన ఈ చారిత్రక గుట్టలను కాపాడాలని ‘సొసైటీ టు సేవ్ రాక్స్’ ప్రతినిధులు దశాబ్దాలుగా న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాతి గుట్టలతో కూడిన ప్రభుత్వ భూమిని రక్షించాలంటూ 2019లోనే మున్సిపల్, రెవెన్యూ శాఖలను హైకోర్టు ఆదేశించింది. అయితే, క్షేత్రస్థాయిలో హద్దుల గుర్తింపు, ఫెన్సింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఈ భూములు కబ్జా గురయ్యే ప్రమాదం ఏర్పడింది. దీనిపై సదరు సొసైటీ ప్రతినిధులు ఇటీవల ‘హైడ్రా ప్రజావాణి’లో ఫిర్యాదు చేశారు. స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గతంలోనే రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. పక్కా ఆధారాలతో అది ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకుని, పర్యావరణ దినోత్సవం రోజైన శుక్రవారమే రక్షణ చర్యలు చేపట్టారు.

రెవెన్యూ రికార్డుల లెక్కలు 

రెవెన్యూ శాఖ అధికారిక లెక్కల ప్రకారం సర్వే నంబరు 452/1లో 174 ఎకరాలు, సర్వే నంబరు 454/1 లో 119.05 ఎకరాల చొప్పున మొత్తం 293.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో గతంలో ప్రభుత్వం 263.05 ఎకరాలను హెచ్‌ఎండీఏకు కేటాయించింది. రెండు గ్రామాల మధ్య ఉన్న సరిహద్దు (ఓవర్ లాపింగ్) వివాదాల వల్ల 63.05 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులదిగా రెవెన్యూ అధికారులు గుర్తించారు.

దీంతో హెచ్‌ఎండీఏ పరిధిలో 200 ఎకరాలు మిగిలాయి. ఈ చారిత్రక గుట్టల ప్రాంతంలో వివిధ దేవాలయాలకు 5 ఎకరాలు, దర్గాకు 5 ఎకరాలు కేటాయించగా, మిగిలిన పూర్తి భూమిని కలుపుకుని మొత్తం 200 ఎకరాల హెచ్‌ఎండీఏ భూమికి హైడ్రా ఫెన్సింగ్ వేసి రక్షణ కల్పించింది.

పర్యాటక కేంద్రంగా భగీరథమ్మ చెరువు

ఇంతవరకు రక్షణ లేకపోవడంతో ఈ చారిత్రక స్థలంలో రాత్రి వేళల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుండేవని, హైడ్రా చర్యలతో వాటికి అడ్డుకట్ట పడిందని స్థానికులు, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ గుట్టలను ఆనుకుని ఉన్న భగీరథమ్మ చెరువును కూడా హైడ్రా ప్రస్తుతం పునరుద్ధరిస్తోంది. ఒకపక్క ఆకాశాన్నంటే ఎత్తున చారిత్రక కొండ లు, దిగువన అందమైన భగీరథమ్మ చెరువు పనులు పూర్తయితే.. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం హైదరాబాద్‌లోనే అత్యంత ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది.