8 March, 2026 | 1:46 AM

గోల్ఫ్.. అదరహో అమూల్య

08-03-2026 12:03 AM

పట్టుదల, కటోర శ్రమ, అందుకు తగ్గ ప్రోత్సాహం ఉంటే ఎలాంటి లక్ష్యాన్ని అయినా ఛేదించవచ్చని మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన గుగులోత్ అమూల్య నిరూపిస్తోంది. ధనికులకు.. అందులో కొందరికి మాత్రమే పరిమితం అనుకున్న గోల్ఫ్ క్రీడలో మహబూబ్‌నగర్ జిల్లా ఎర్రసోమ్లా తండాకు చెందిన విద్యార్థిని గుగులోత్ అమూల్య.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

చదువుతోపాటు క్రీడల్లో రాణించడానికి ఆమె ఆసక్తి చూపుతున్న తరుణంలో గోల్ఫ్ క్రీడపై మక్కువ పెంచుకుంది. ఆమెలో ఉన్న పట్టుదలను చూసిన కోచ్ భాస్కర్ గోల్ఫ్ క్రీడలో రాణించేలా పరిమితమైన వనరులతోనే అమూల్యను వర్ధమాన క్రీడాకారిణిగా తీర్చిదిద్దారు. 

క్రీడా రంగం అనేది కేవలం శారీరక సామర్థ్యంతో మాత్రమే కాకుండా పట్టుదల, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ కలిసొచ్చే వేదిక. అలాంటి రంగంలో పురుషాధిక్యంగా భావించే గోల్ఫ్ క్రీడలో తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు పొందుతోంది యువ క్రీడాకారిణి అమూల్య. సాధారణ కుటుంబం నుంచి ప్రారంభమైన ఆమె క్రీడా జీవన ప్రయాణం, నేడు అనేక మంది విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తోంది.

చిన్న వయస్సులోనే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకున్న అమూల్య, తొలుత పలు క్రీడల్లో పాల్గొన్నప్పటికీ గోల్ఫ్ మైదానం ఆమెకు ప్రత్యేకమైన ఆకర్షణగా మారింది. ఎంతో సహనం, నైపుణ్యం అవసరమయ్యే ఈ క్రీడలో తన ప్రతిభను నిరూపించుకోవాలని సంకల్పించి కఠిన సాధన ప్రారంభించింది. ప్రతిరోజూ గంటల తరబడి శ్రమిస్తూ తన ఆటలో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంది.

జాతీయ స్థాయి టోర్నమెంట్‌లో సత్తా

గోల్ఫ్ క్రీడలో ఒక్కో షాట్ వెనుక ఉన్న ఖచ్చితత్వం, వ్యూహం, మానసిక స్థుర్యైం అత్యంత కీలకం. ఈ మూడు లక్షణాలను సమన్వయంగా కలగలిపి అమూల్య తన ఆటతీరుతో క్రీడాభిమానులను ఆకట్టుకుంటోంది. రాష్ట్ర స్థాయి పోటీల నుంచి జాతీయ స్థాయి టోర్నమెంట్‌ల వరకు పాల్గొంటూ తన ప్రతిభను చాటుకుంటోంది. అనేక పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచి పతకాలు సాధించడం ద్వారా గోల్ఫ్ రంగంలో తన స్థానాన్ని బలపరుచుకుంటోంది.

అమూల్య విజయగాథలో అత్యంత ముఖ్యమైన అంశం ఆమె పట్టుదల. ఆర్థిక ఇబ్బందులు, సౌకర్యాల కొరత వంటి సమస్యలు ఎదురైనా ఆమె వెనుకడుగు వేయలేదు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, కోదీతిజిజిల మార్గదర్శకత్వం ఆమె ప్రయాణానికి బలమైన ఆధారంగా నిలిచాయి. క్రమశిక్షణతో కూడిన సాధన, నిరంతర శ్రమతో ఆమె ప్రతి పోటీలో తన సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకుంటోంది.

ఇప్పటి యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అమ్మాయిలకు అమూల్య ఒక స్ఫూర్తి చిహ్నంగా నిలుస్తోంది. క్రీడా రంగంలో అవకాశాలు అపారంగా ఉన్నాయని, పట్టుదలతో ప్రయత్నిస్తే ఎలాంటి రంగంలోనైనా మహిళలు అగ్రస్థానాన్ని సాధించగలరని ఆమె ప్రయాణం స్పష్టంగా తెలియజేస్తోంది. గోల్ఫ్ మైదానంలో అమూల్య వేసే ప్రతి అడుగు, మహిళల సాధికారతకు ఒక కొత్త దిశను సూచిస్తోంది. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలవాలని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు. 

 బండి సంపత్ కుమార్, (మహబూబాబాద్, విజయక్రాంతి)

అమూల్య విజయాలు

2022 అమూల్య క్రీడా ప్రతిభకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. సౌత్ జోన్ టోర్నమెంట్లో పతకాలను సాధించింది. హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన గోల్ఫ్ ఓపెన్ 2026 పోటీలో మొదటిసారి పాల్గొని, 300 మందికి పైగా గోల్ఫర్లు పాల్గొన్న ఈ పోటీలో అమూల్య టోర్నమెంట్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ పోటీలో అమూల్య అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించింది. క్వాలిఫైయర్లో 75 ఫైనల్లో 73 స్కోర్లు సాధించి మొత్తం 148తో గ్రాస్ విజేతగా నిలిచి చివరి రౌండులో ఆమె షాట్లు నిశితంగా దూసుకెళ్లాయి.

ఐరన్ షాట్లు లక్ష్యాన్ని చీల్చి ఒత్తిడిలోనూ సెట్టింగ్లో స్థిరత్వం కనబరిచి తుది ఫలితాల్లో అమూల్య ఛాంపియన్‌గా నిలిచింది. బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్ పచ్చిక మైదానం క్రీడలకు అతీతమైన అమూల్య ప్రతిభకు వేదికగా మారింది. గ్రాస్ విజేతగా అమూల్యకు 90 వేల రూపాయల నగదు బహుమతి, హైదరాబాద్ చారిత్రక చిహ్నాలతో రూపొందించిన క్రిస్టల్ ట్రోఫీని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా అందుకున్నారు. అలాగే థాయిలాండ్‌లో మూడు రోజులపాటు నిర్వహించే మూడు రౌండ్ల గోల్ఫ్ ఓచర్, వన్ ప్లస్ నోర్డ్ 5 ఫోన్, గోద్రెజ్ సేఫ్ ప్రతిష్టత్మక గ్రీన్ జాకెట్ అందుకున్నారు. గోల్ఫ్ క్రీడలో మారుమూల గ్రామీణ ప్రాంతానికి చెందిన అమూల్య ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి దక్కించుకుంది.